పుట:వరాహపురాణము (నంది మల్లయ, ఘంట సింగయ).pdf/192

ఈ పుట అచ్చుదిద్దబడ్డది


ఫలంబున భువర్లోకంబునకుం జనుదురు తల్లోకంబునం గేశవు భజించి స్వర్లోకంబు
నకుం జని క్రమక్రమంబున ముక్తు లగుదురు.

12


గీ.

ఇవ్విధంబున నిశ్శంక నేసరేఁగి, యెల్లవారలు మోక్షంబు కొల్లగొనఁగఁ
జూడఁ జాలక యింద్రాదిసురలు గూడి, కదలి వైకుంఠపతిసమ్ముఖమున కరిగి.

13


క.

ధరఁ జాగిలి మ్రొక్కిన నా, హరి కరుణాపూరితేక్షణాంతంబుల ని
ర్జరవరులం గని యిచ్చటి, కరుదెంచితి రేటి కన బృహస్పతి పలికెన్.

14


సీ.

అనిశంబు వీఁడు వాఁ డనక యెక్కఁగ వేల్పుటేనుఁగునకు వీఁపు గూనువోయె
వరుసలు పెట్టి దువాళింప సుడివడి వెలిమావు మోపదు వెనుకకాలు
విడువనివేలంబు నుడిగంబులు గొనంగ నిచ్చలు నిద్ర లే దచ్చరలకు
దుండగంబునఁ బూల గుండాడ వికలితవృత్తిఁ గల్పక వాటి వీఁటిబోయె
స్వామి గుఱియించి పెక్కుయజ్ఞములు సలిపి, భూమిప్రజ లెల్ల నింద్రు లై పోతరమున
గొడ్డిగము లిట్లు చేయంగ నడ్డ పెట్ట, రాక బహునాయకం బయ్యె నాకపురము.

15


సీ.

శ్రీవైష్ణవులపాదరేణువు తనువుపై నొకయింత పడినధన్యుండు వీఁడు
పరమభాగవతులు పురుషసూక్తము చెప్ప నొకమాటు వినినపుణ్యుండు వీఁడు
తులసీవనీవాసనలు పయిగాలి రా నొకనాఁడు చనినసభ్యుండు వీఁడు
హరి తిరుమాళిగ గరుడధ్వజాంచలం బొకకొంత గన్నపుణ్యుండు వీఁడు
వీరిఁ దడవుట యె ట్లని క్రూరవృత్తి, యమునిదూతల నీబంట్లు సమయమోఁది
భూజనుల నెల్లఁ గైవల్యమునకు ననుప, నిర్జనం బయ్యె సంయమనీపురంబు.

16


క.

దేవా క్రమక్రమంబునఁ, బావనులై సృష్టిఁ గలుగుప్రజ లీకరణిం
గైవల్యంబున కేగెడు, హావళిచే మాకు నడవ వధికారంబుల్.

17


శా.

ఏలా వేయును విన్నవింపఁగఁ ద్రిలోకేశా మహేంద్రాదిది
క్పాలైశ్వర్యము వెచ్చపెట్టుకొను మింకన్ సృష్టి నష్టం బగున్
వాలాయంబుగ నంచు గీష్పతి సుపర్వశ్రేణివిజ్ఞాపనల్
పోలం జెప్పిన నాలకించి ధవళాంభోరాశిపర్యంకుఁడున్.

18


సీ.

నను సంస్మరింప వచ్చినఁ జూచి నాతోడఁ దివిజులమనవులు దెలియఁ జెప్పి
త్రిపురసంహర యుగత్రితయంబునన కాని నాలవయుగమున నాదు భక్తి
తఱుచు లేకుండంగఁ దగినమోహంబు పుట్టించెద నీవుఁ గల్పించు తదను
కూలశాస్త్రంబులు గొన్ని స్వల్పప్రయాసంబున నధికఫలంబు గలుగు
నంచు బ్రమయించునట్లుగా ననిన నేను, బాశుపతనయసిద్ధాంతబౌద్ధజైన
ముఖ్యమతములు చెప్పితి మునివతంస, నాఁడు మొదలుగ భూమిజనంబు లెల్ల.

19