పుట:వరాహపురాణము (నంది మల్లయ, ఘంట సింగయ).pdf/142

ఈ పుట అచ్చుదిద్దబడ్డది


చ.

తలఁపఁగ వాక్యవైఖరిఁ గథ మ్మన శక్తుఁడు గాఁడు శేషకుం
డలిపతి యైన మి మ్మెదిరి నావలనం బదివేలు తప్పులున్
గలవు ప్రధానవృత్తి ననుకంప వహించి వసుంధరామరు
త్కులమణులార శాపమునకుం గడ యెన్నఁడు నాకుఁ జెప్పుఁడా.

87


సీ.

అని విన్నపంబు చేసిన రాజ కడునాఁకలి గొని షష్టాన్నకాలికుని నొక్క
బ్రాహ్మణశ్రేష్ఠుని భక్షింపఁ జని భిల్లశాతభల్లాహతిఁ జచ్చువేళ
నవ్విప్రుఁ డతిభయవ్యాకులత్వమున నారాయణస్మరణంబు చేయ విన్న
ఫలమున శార్దూలభావంబు వీడ్కొని పురుషుండవై ముక్తిఁ బొందఁగలవు
తథ్య మనిరి భవన్నిమిత్తమున నట్ల, శాపమోక్షంబు గలిగె సాక్షాత్పురాణ
పురుషమూర్తులు గావున ధరణిదైవ, తములసద్భాషణము లమోఘములు సుమ్ము.

88


శా.

ఆకర్ణింపు మునీంద్ర యే నొకరహస్యం బూర్ధ్వబాహుండనై
నీకుం జెప్పెద మేదినీసురవరుల్ నిక్కంబు నిక్కంబు ల
క్ష్మీకాంతప్రతిబింబముల్ జపతపస్సిద్ధుల్ సదా శుద్ధు ల
స్తోకజ్ఞానకళాధురంధరు లనింద్యుల్ వంద్యు లెవ్వారికిన్.

89


వ.

బ్రాహ్మణద్వేషి యైన ననువంటిపాపకర్ముండు సైతము నారాయణమంత్రంబు పర
ముఖంబున విన్నమాత్రంబునఁ బవిత్రుం డయ్యె బ్రాహ్మణభక్తియుక్తులై భక్తిపూ
ర్వకంబుగా నారాయణమంత్రంబు జపియించినపుణ్యులమహిమ యే మని చెప్ప
నని బ్రాహ్మణప్రశంస గావించి నారాయణమంత్రప్రభావంబు వచియించి దీర్ఘబా
హుం డనర్ఘమాణిక్యమయవిమానం బెక్కి స్వర్ఘంటాపథంబునం జనియె మునియు
వనేచరుం గటాక్షించి మహోత్సాహంబున వత్సా భవత్సాహసంబునకు నామీఁది
విశ్వాసంబునకు మెచ్చితి వరంబు వేఁడు మని మన్నింప నన్నిషాదుండు దండ
ప్రణామంబు చేసి తాపసోత్తంస యింతకాలంబునకు సుముఖుండవై నాతోడ
సంభాషించుటకంటె వరంబులు గలవే నన్నుఁ బనిచి పనిగొను మని విన్నవించిన.

90


సీ.

ఓయికిరాతాన్వయోత్తంస పశ్యతోహరత వీడ్కొని తపశ్చరణకాంక్ష
ము న్నొక్కమంత్రంబు నన్నుఁ బ్రార్థించిన నాఁటికి నీతోడ మాటలాడ
నైతి వయోగ్యుండ వని నేఁడు దైవికాపుణ్యజలస్నానమున మదీయ
సందర్శనమున గోవిందనామశ్రవణంబున నతిపావనత వహించి
నిలిచితివి గానఁ దగుదువు నిఖిలకర్మ, ములకుఁ దపమైనఁ జేయుము వలసె నేని
వరము లేమైన వేఁడు నా నరుణిమౌని, మణికి బోయ పునఃప్రణామంబు చేసి.