పుట:వరాహపురాణము (నంది మల్లయ, ఘంట సింగయ).pdf/132

ఈ పుట అచ్చుదిద్దబడ్డది


వ.

ఇంద్రనీలతమాలకువలయాంజనాభ కంజనాభ నీవు నిరంతరంబును జ్ఞానవిభేదనా
ర్థంబు ఖడ్గంబును ధర్మభేదనార్థంబు గదాదండంబును ధరియించి కాలచక్రంబు
చక్రంబుగా సవిద్యాజయంబు శంఖంబుగా భూపదంబు పదంబుగా యజ్ఞాంగంబు
ముసలంబుగా భూతమాలిక కంఠమాలికగా సుధాకరమార్తాండమండలంబులు శ్రీవ
త్సకౌస్తుభంబులుగా సమీరణుండు గరుత్మంతుఁడుగా సవరించి నానాభువనగామిని
లక్ష్మీభామిని వరియించి ప్రతియుగంబున వివిధరూపంబుల నవతరించి శిష్టరక్షణం
బంగీకరించి దుష్టరాక్షసుల సంహరించి విహరింపు మనియె నవ్విష్ణునిజన్మదివసంబు
గావున ద్వాదశినాఁడు కథ విని హయ్యంగవీనాహారు లైనవారికి శాశ్వతస్వర్గ
భోగంబులు గలుగు నింక ధర్మంబు జన్మించినవిధంబు వినుము.

13


క.

మును సరసీరుహగర్భుఁడు, తనమదిలో మద్వినిర్మితప్రజ ధర్మం
బున మెలపఁజాలు పురుషుం, డనవద్యుం డొకఁడు వలయు నని చింతింపన్.

14


శా.

ఆకంజాసనుదక్షిణాంగమున నీహారేందుకుందప్రభా
నీకాశుం డవదాతపట్టవసనాన్వీతుం డతిస్థూలము
క్తాకర్ణాభరణుండు పుట్టె నొకఁ డత్యంతక్షమావంతుఁడై
నాకానోకహపుష్పగంధిమకుటన్యస్తాంజలుల్ మీఱఁగన్.

15


శా.

వానిం జూచి పితామహుండు నగుచున్ వత్సా జగజ్జంతుసం
తానంబుల్ భవదీయశాసనమున వర్తింప సత్కీర్తితో
నీనేర్పుల్ గొనియాడ నుండు మని మన్నింపం జతుష్పాదుఁడై
తా నిల్చెన్ సుజనానురంజనముగా ధర్మాభిధానంబునన్.

16


సీ.

ఈరీతి సకలలోకైకనాయకుఁ డైనధర్ముండు నాల్గుపాదములు నిలిపి
కృతయుగంబున సంచరించుఁ ద్రేతాయుగంబున మూఁడుపాదముల్ మోపి నడచు
మెలఁగు రెండంఘ్రుల మెట్టి ద్వాపరయుగంబునఁ గలియుగమున వెనుకఁ ద్రొక్కి
తొక్కి ప్రవర్తించు నొక్కకా లూఁది ప్రజాపాలమానవేశ్వరవతంస
వినుము సచరాచరాంతరంబున వసుంధ, రామరక్షత్రవైశ్యశూద్రాన్వయముల
నామహాత్ముండు భాగంబు లాఱు మూఁడు, రెండు నొకటియునై విహరించుచుండు.

17


క.

ఈకరణి ధర్మపురుషుఁడు లోకత్రయపూర్ణుఁడై నిలుచువేళ నహ
ల్యాకాముకగురుతోడ నిశాకరుఁడు తదేకనిష్ఠఁ జదువుచు నుండన్.

18


క.

ఆగురువు చిగురుఁబోఁడి స, దా గరగరనై మనోజుతరవారిగతిన్
సోగ మెఱుంగుతెఱంగునఁ, దా గేహములోన మెలఁగుఁ దారుణ్యమునన్.

19