ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ix

పనిచేయఁ దొడఁగుదురు. ఈ వ్యాసకర్తలట్టివారు.

స్వాతంత్య్రమనఁగా స్వరాజ్యమని మాత్రమేకాదు. కేవలము దానికై పోరాడుచు ప్రజలలోని నీతి మత ధర్మాదులయందుఁగల దాస్యమును దైన్యమును గమనింపక విడిచిన స్వతంత్రవాది ప్రాయశః స్వార్థపరులలో మొదటివాఁడని భావించి మనము దూరముగా తొలఁగి పోవలయును. రాజకీయ స్వాతంత్య మొకకొమ్మలోని పండేకాని పంటయంతయు నదేకాదు. తక్కినవానితోపాటదియు పండును. దానికై ప్రత్యేకముగా శ్రమించి తక్కినవానిని వదలుట వెఱ్ఱిసేద్యము. కావుననే యీవ్యాసకర్తలు భరతఖండ రాజకీయ స్వాతంత్య్రమునుగూర్చి యెక్కువ జోక్యము చూపలేదు. వీరు పొమ్మనువారుగారు, పొగఁబెట్టువారు.

ఇట్టి ప్రజోద్బోధ కార్యమునకు ఇంగ్లీషు సారస్వతము నందలి అడిసన్ దొర ఆశ్రయించిన పేరులేని యుపన్యాసములను పంచిపెట్టు పద్ధతి చాల అనుకూలముగా ఈ వ్యాసకర్తలకుఁ దోఁచినది. అడిసను ప్రకటించిన 'స్పెక్టేటరు', అతని మిత్రుఁడగు స్టీలు ప్రచురించిన 'టాట్లరు' వ్యాసములకుఁ గల ప్రసిద్ధియు విలువయు ఆంగ్ల సారస్వతముతో పరిచయముగల వారందఱు నెఱుఁగుదురు.