పుట:లండన్‍లో తెలుగు వైభవ స్మృతులు.pdf/24

ఈ పుట ఆమోదించబడ్డది

మొత్తం మ్యూజియమంతా చూడాలంటే ఒకరోజులో పూర్తయ్యే పని కాదు. అందువల్ల ఏకాయెకిన అమరావతి గ్యాలరీకి వెళ్లాము. అద్దాలగదిలో అతి జాగ్రత్తగా అమర్చిన అమరావతి శిల్పాలను చూసి అచ్చెరువు చెందాను.

మ్యూజియంలో వివిధ దేశాల శిల్పులు చెక్కిన శిల్పాలు వందలాదిగా ఉన్నాయి. కానీ వాటిలో తలమానికమైనవి మన అమరావతి శిల్పాలు. బ్రిటీష్ మ్యూజియానికి వన్నె తెచ్చిన మహాశిల్పాలు అవి.

శిల్పరూపంలో సౌందర్యాన్ని పోతపోసి లోకోత్తర కళాసృష్టి చేసిన ఆంధ్ర శిల్పికి జోహార్లు అర్పించకుండా ఉండలేకపోయాను. తెలుగు శిల్పుల ఉలి చెక్కిన శిల్పాలు సృష్టికే అందాలు తెచ్చాయి. వాటిని చూసి తెలుగువాడిగా గర్వపడ్డాను. అంతకుమించి విదేశీయులు ఆ శిల్పాల మనోహరత్వాన్ని తిలకించి, మైమరుస్తుంటే మరింత ఆనందమనిపించింది.

అమరావతి శిల్పాలు నిజంగా రాతిలో కవితలు. మనోహరత్వం, ప్రాణ స్పందనలతో ఎంతో మనోజ్ఞంగా దర్శనమవుతున్నాయి. ధార్మిక విషయాలనే కాక, లౌకిక విషయాలను కూడా శిల్పించడం గమనించాను. దేవతామూరులకు బదులు ఈ శిల్పాల్లో మానవుల, జంతువుల, పక్షుల, వృక్ష రూపాలు ఎక్కువ గోచరిస్తాయి. నిత్య జీవితంలోని సామాన్య ఘట్టాలకు రూపం యిచ్చారు. మానవుని నిత్యజీవితంలోని ప్రేమ, సంయోగవియోగాలు, బాధలు, ద్వేషం, వ్యధలు, క్రీడలు, అలంకరణలు తదితరాలేవీ వారి కళాసృష్టి నుంచి తప్పించుకోలేదు.

హీనయాన బౌద్ధ శిల్పులు బుద్ధుని రూపం ఎక్కడా ప్రవేశించకుండా జాగ్రత్త పడ్డారు. ఈ శిల్పాలు బ్రిటీష్ మ్యూజియానికి తరలిపోవడం వెనుక పెద్ద చరిత్రే వుంది. దానిని సంక్షిప్తంగా క్రింద ఇస్తున్నాను. బ్రిటిష్ మ్యూజియంలో ప్రాచ్యదేశాల ప్రాచీన సంపద విభాగానికి డిప్యూటీ కీపర్‌గా పని చేస్తుండిన శ్రీ రాబర్ట్ నాక్స్ (Robert knox) వ్రాసిన "Amaravati-Buddhist Sculpture from the Great Stupa" గ్రంథం నుంచి ఈ విషయాలు తీసుకోబడ్డాయి.