పుట:లండన్‍లో తెలుగు వైభవ స్మృతులు.pdf/12

ఈ పుట ఆమోదించబడ్డది

ప్రాంతీయులు శ్రీమతి తార వడ్డె, డా॥ఎస్. కృష్ణ, డా॥ హరనాథ్ రెడ్డి, డా॥ చి. హరిమోహన్, డా॥ధనంజయరావు చుండూరి, వారి సోదరులు మా అవనిగడ్డలో ప్రముఖ న్యాయవాది శ్రీ కంఠంనేని రవీంద్రరావుగారి కుమార్తె, అల్లుడు డా॥ వేములపల్లి రవి కలిశారు. డా॥ వెలగపూడి బాపూజీరావుగారి సంపాదకత్వాన వెలువరించిన ప్రత్యేక సంచిక చక్కటి వ్యాసాలతో, చిత్రాలతో ఆకర్షణీయంగ రూపొందించారు. ప్రసిద్ధ చిత్రకారుడు బాపు, డార్విన్ పరిణామక్రమాన్ని దశావతారాలతో సమ్మేళనం చేస్తూ వేసిన ముఖచిత్రం ఎంతో ఆలోచనాత్మకంగా ఉంది. 200 ఏళ్ల క్రితం జన్మించిన డార్విన్ ప్రతిపాదించిన పరిణామక్రమ సిద్ధాంతానికి, వేల ఏళ్ల క్రితమే భారతదేశ పురాణాలలో దశావతారాల ద్వారా పరిణామదశలను సూచించిటం ద్వారా స్ఫూర్తి నిచ్చిందనే అర్ధం వచ్చేటట్లు చక్కటి చిత్రాన్ని చిత్రించడం శ్రీ బాపూకే చెల్లింది.

సమ్మేళనంలో స్థానిక కళాకారులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతో ఆకర్షించాయి. ఈ పర్యటనలో శ్రీ సూర్యదేవర ప్రసాద్ దంపతులు, కవిరాజు త్రిపురనేని రామస్వామి చౌదరిగారి కుమారుడు డా॥ గోవర్ధన చంద్, వారి సతీమణి శ్రీమతి సతి వారి ఇళ్లకు ఆహ్వానించి చక్కటి ఆతిథ్యమిచ్చారు. ప్రసిద్ధ కవి స్వర్గీయ దేవరకొండ బాలగంగాధర తిలక్ కుమారుడు డా॥ సత్యనారాయణ మూర్తి, మా నాన్నగారి స్నేహితులు డా॥ బాబూరావు చాపరాలను కలవడం ప్రత్యేకంగా ఆనందాన్నిచ్చింది.

డా॥ చదలవాడ సుబ్బారావు, శ్రీమతి ఉమాబాల దంపతులు చూపిన ప్రేమాభిమానాలు మరువలేము. డా॥ సుబ్బారావు నిగర్వి పెద్దరికంలోను హుందాతనంలోను వారికి వారేసాటి. గుంటూరు ప్రముఖులు, ప్రసిద్ధ వైద్యులు, మాజీ శాసనసభ్యులు, సంఘసేవాపరాయణులు డాక్టర్ కాసరనేని సదాశివరావుగారి కుమార్తె శ్రీమతి ఉమాబాల. డా॥ సుబ్బారావుగారు తీరికలేని పనివత్తిడిలో ఉండి కూడా మమ్మల్ని తమ కారులో లేక్‍డిస్ట్రిక్ట్‍కు తీసుకెళ్లారు. సుందరమైన కొండచరియల నడుమ మనోహరమైన సరస్సులతో ప్రకృతి సౌందర్య శోభితమైన ప్రదేశాన్ని మాకు వారక్కడ చూపించారు.