పుట:రెండో పపంచయుద్ధమా?.pdf/11

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తొలిపలుకు

మా గ్రంథమాల ప్రధమ సుమమగు కథలసంపుటి "కమ్మతెమ్మరల" ను ఆంధ్రలోకము ఆదరించినది. ఆదరించి, యిప్పుడు ఈ "రెండో ప్రపంచ యుద్ధమా?" అను ద్వితీయ ప్రచురణమునకు పురికొల్పినది.

ఈ గ్రంధము అతిత్వరితముగా రచింపబడినది. ఎందుకనగా దీని రెండవభాగము ఇంతకన్నను తొందరగా వ్రాయవలసియుండెను. వివిధరాజ్యముల యొక్క వాదములను, దేశములయొక్క స్థితిగతులను 1914 నుండి 1940 వరకు జరిగిన సంధి సంప్రతింపులను, ఆ మూలాగ్రముగా ఉదహరించి, విషయములను కూలంకషముగా చర్చింపకున్నను పుస్తకము ఇంతగా పెరిగి పోవుటచే దీనిని రెండుభాగములలో ముద్రింపవలసివచ్చెను. అయినను ముఖ్య విషయములేవియు వదలివేయబడలేదు. ప్రకాశకుల యొక్కయు, గ్రంథకర్తయొక్కయు అభిప్రాయము, మొదటినుండియు పత్రికలు చదువలేక అంతర్జాతీయ పరిస్థితులను తెలిసికొనక యుండిన సర్వసామాన్య అక్షరాస్యులకుగూడా ఈ పుస్తకము సుబోధకముగా నుండవలయునని. విద్యార్థులకు గూడ సహాయకారియగునని మా తలంపు. సాధ్యమయినంతవరకు వ్యావహారిక భాష వాడబడినది.

దూరమునుండి, ఒక బంతి ఆటను జూచినతరువాత, కేవల నిష్పాక్షిక దృష్టితో దానిని వర్ణించు పగిది, యూరపులోని రాజకీయ చదరంగపుటాడ కాండ్ర యెత్తులను వివరించి, తమ యభిప్రాయమును పాఠకులపై రుద్దక, వారినే సర్వము ఊహించుకొనునట్లుగా గ్రంథకర్తగారు ఈ పొత్తమును వ్రాసిరి.

మా గ్రంధమాలకు వీరొనర్చిన సహాయము అమితము. పుస్తకము వ్రాయుటేగాక ప్రూఫులనుగూడ, శ్రమకోర్చి, దిద్దిపెట్టిన వీరికినీ, ఈ గ్రంధమును ముద్రించుటకు తోడ్పడిన మహాశయులకు, మా ఆత్మసమర్పిత కృతజ్ఞాతా వందనములు.

ఇట్లు

ప్రకాశకులు.