పుట:రుక్మిణీపరిణయము (కూచిమంచి తిమ్మన).pdf/8

ఈ పుట అచ్చుదిద్దబడ్డది


క.

శూద్రులు గల రురుసుగుణస, ముద్రులు సతతస్వధైర్యమోఘీకృతహే
మాద్రులు ఘోరరణాంగణ, రుద్రు ననంబోలి మహితరుచి నవ్వీటన్.

51


సీ.

తమగానములకు సంతసిలి పున్నాగముల్ ప్రస్ఫుటభోగసంభ్రమత నలరఁ
దమవిహారముల కెంతయు భూజనుల్ చొక్కి సుమనోవికాసవిస్ఫూర్తిఁ దనరఁ
దమముఖాంభోజగంధములకు సరసాళు లుప్పొంగి మదబుద్ధిఁ గప్పుకొనఁగఁ
దమమణినూపురధ్వనులకుఁ బరమహంసలు సోలి మానసాసక్తి నఱుమఁ


తే.

గేరి పగ మీఱి బలుతూపు లేఱి నూఱి, తూఱి నడి నేయుశంబరవైరిఁ బారిఁ
గూరి వేసారి తముఁ గోరి చేరువిటుల, రతులఁ దేలింతు రౌ వారరమణు లందు.

52


ఉ.

తమ్ములు మొల్లలుం దొగలుదాసనముల్ విరిపొన్నలున్ శిరీ
షములు హల్లకంబులును జంపకజాలము లిప్పమొగ్గలున్
సమ్మతి నమ్మఁ జూపి తమచారుతరావయవద్యుతిప్రకా
శ మ్మెఱిఁగింతు రెంతయును జాణల కప్పురిఁ బుష్పలావికల్.

53


సీ.

చెలిమిఁ గైకొనియెదఁ జెం డ్లిమ్ము చెలియున్నఁ గొనుమారుబేరముల్ కొసర కిపుడు
పొదలెడుచివురు సూపెద విది ముద్దియ మేలనఁ బలుగెంపులోలి నింపు
సుమకలంబక్రీడ నమరింపు సఖి యన్న నది నీవి వదలింప కనువుగాద
యెల్లవేళల నుండుమల్లికల్ గా వేడ్క ననఁగ మూపురములోఁ గొనియనిచెద


తే.

ననుచుఁ దముఁ జేరి కేరెడుననుపుకాండ్రఁ, గనుచు నెఱదంటపలుకులు వినుచుమదినిఁ
బెనుచుమదమున ననలమ్ముకొ'నుచు మనుచుఁ, బుష్పలావిక లుందు రప్పురమునందు.

54


సీ.

ఈమంజులకుచంబు లీచానయన నివి కొనఁగోర నొక్కింతగొనబొనర్చు
నంటి ఫలంబు గైకొంట నీయెడఁదగు నన నటకానిమ్మ వెనుకరమ్ము
నెలఁత మాకందంబు ని న్గోరుట లనఁగఁ బలుమాఱు కేలికి నలరియుండు
మోవి పంటను గంటిఁ గావించి చూతునా యనఁ బండుఁ గని యిటు లాడనగునె


తే.

యనుచు ఫలములు గొనఁబూని నటులు నిటులు, మొనసి సరసోక్తు లాడుచు నెనసి తిరుగు
విటుల కింపుగ మఱుమాట వెస నొసఁగుచుఁ, ఫలము లమ్మెడిచెలు లుందు రెలమి నందు.

55


క.

ఆనగర మేలు మేలుగ, మానితకీర్తిప్రతాపమహిమోన్నతిచేఁ
బూనిక మీఱఁగ భీష్మక, భూనాయకుఁ డెపుడు సకలబుధజననుతుఁ డై.

56


సీ.

కువలయంబున కార్తిఁ గూర్పనియినుఁడు చక్రావళి నేఁచక యలరురాజు
ధర్మహింసనమునఁ దనరనిరాముఁడు భోగినీసురతేచ్ఛఁ బోనివిజయుఁ
డతిరాజసమున మిన్నందనిశూరుఁడు గోత్రాహితుఁడుగాని గోవిభుండు
పరమహంసలఁ బోవఁ దఱుమనిఘనుఁడు నెవ్వడిభంగ మొందనివాహినీశుఁ


తే.

డనఁగఁ దేజఃకళానృపవినుతిశౌర్య, జనవిభనదానగాంభీర్యశాలి యగుచుఁ
బూని తనకీర్తి జగ మెల్లఁ బొగడనెగడె, వన్నె మీఱంగ భీష్మకావనివరుండు.

57