పుట:రామేశ్వరమాహాత్మ్యము (ఏనుగు లక్ష్మణకవి).pdf/42

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రథమాశ్వాసము

41


తాసితసరిత్తోయంబుల నేమి ప్రయోజనంబు. ధనుష్కోటి దర్శిం
చిన ధన్యులకుఁ గాయక్లేశకరంబులగు తపోయాగాధ్యయనతీర్థా
టనంబుల నేమిలాభంబు. ధనుష్కోటితీర్థంబుతోడ సమానంబగు
తీర్ధంబు లోకత్రయంబునం గలుగదు. సత్యంబు చెప్పితి నిది
ధనుష్కోటితీర్ధవైభవం. బీతెరంగున సేతుబంధనిబంధనప్రకారం
బును, చతుర్వింశతితీర్థవైభవంబును సంగ్రహప్రకారంబున మీకు
వివరించితి. సవిస్తరంబుగా వచింప ననేకయుగంబులకైన శక్యం
బుగాక యుండు. నీయుపాఖ్యానంబు సుచిత్తంబుగా విన్నవారికిఁ
జతుర్విధపురుషార్థంబులు సిద్ధించునని సూతుండు చెప్పిన శౌన
కాదిమహామునులు శ్రీరామేశ్వరశివలింగవైభవంబు వచింపుమని
ప్రార్థించిన.

124


మ.

కనకక్ష్మాధరచాపపాపభయహృత్కళ్యాణచారిత్రమి
త్రనిశాధీశకృశానులోచనయనంతప్రస్ఫుటానందచం
దనకుందేందుసితాంగమంగళకరోదంచత్కృపాపాంగభృం
గనవేందీవరనీలకంధరనిరాఘాటప్రభావోన్నతా.

125


క.

తరుణతరశిశిరకరశే
ఖరసరసిజభవశతారకరముఖనిఖిలా
మరమకుటఘటితమణిఘృణి
పరిషద్రుచిరుచిరచరణపంకజయుగళా.

126


మాలిని.

శ్రితకమలపతంగా శ్రీశివాసంయుతాంగా
ధృతతరుణకురంగా దివ్యగోరాట్తురంగా
రతిపతిమదభంగా రాజభాస్వద్రథాంగా
క్షితిరచితశతాంగా చెన్నమల్లేశలింగా.

127