పుట:రామేశ్వరమాహాత్మ్యము (ఏనుగు లక్ష్మణకవి).pdf/40

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రథమాశ్వాసము

39


న్నవించిన పట్ల శంకరుండు సర్వతీర్థంబుల నాహ్వానంబుఁ జేసి
స్నానంబు సేయుమని యాజ్ఞాపించె. నామునియు నట్ల కృతాభిషే
కుండై మహాసుందరమూర్తియై తత్తీర్థంబుఁ గీర్తించె. నందు
స్నానమాత్రంబునం గైవల్యంబు లభించు. శివుండు తన మానసం
బుచేతం దీర్థంబులనెల్ల నాకర్షించెఁ గావున మానసతీర్థాభి
ధానంబునుం గలిగె. నిది మానసతీర్థమాహాత్మ్యం. బింక ధనుష్కో
టితీర్థవైభవంబు వివరించెదఁ. దదీయస్మరణమాత్రంబున బ్రహ్మ
సాయుజ్యంబు గలుగునని యిట్లనియె.

119


సీ.

అంధతామిస్రమహౌరౌరవాదిదు
        ర్గజాతయాతనాఖండనంబు
మహితాశ్వమేధాది బహుధాధ్వరక్రియా
        తతపుణ్యవిభవసంధాయకంబు
భువనాభిసురతు నా పురుషప్రభృతిమహా
        దానఫలోత్కర్షదాయకంబు
బ్రహ్మహత్యాసురాపానహేమస్తేయ
        గురుతల్పగమనాఘకోటిహరము


గీ.

బ్రహ్మచర్యోపవాసాది పరమనిగమ
గమ్యబహువిధపుణ్యలోకప్రదంబు
కామితార్థైకవితరణకల్పతరువు
ధీరులార ధనుష్కోటితీర్థవరము.

120


ఉ.

రావణు నాజిఁ ద్రుంచి రఘురాముఁడు లంకకు న్వభీషణున్
శ్రీ విలసిల్లఁగా నధిపుఁ జేసి సురాసురసిద్ధసాధ్యసం
ఘావృతుఁడై వెసన్ మరలి యంచితభూతిని గంధమాదన
గ్రామముఁ జేరె లోకములు రంజిల సేతుమహాపదంబునన్.

121


సీ.

అంత రామునిఁ జూచి ప్రాంజలియై సత్య
        భాషణుండైన విభీషణుండు