పుట:రామేశ్వరమాహాత్మ్యము (ఏనుగు లక్ష్మణకవి).pdf/18

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రధమాశ్వాసము

17


వ.

అని వివరించిన రౌమహర్షణితో శౌనకాదిమునీంద్రు లి ట్లనిరి.

41


గీ.

సూత గంభీరజలధిపై సేతుబంధ
మెట్లు గావించె రఘుకులాధీశ్వరుండు
సేతుగతగంధమాదనక్షితిధరమున
నెన్నఁదగుపుణ్యతీర్ధంబు లెన్ని గలవు.

42


గీ.

కలితరామేశశంభులింగప్రతిష్ఠ
రాముఁ డొనరించె నేప్రకారమున మున్ను
తేటపడ మాకు నీకథ తెలియఁ బలికి
మముఁ గృతార్థులఁ జేయుము మౌనితిలక.

43


వ.

అని ప్రార్ధించి యడిగిన శౌనకాదిమహర్షులకు సూతుం డిట్లని చెప్పం
దొడంగె.

44


చ.

దశరథునాజ్ఞచేత గుణధాముఁడు రాముఁ డరణ్యభూమికిం
గుశల మతిఁబ్రియాంగనయుఁ గూరిమితమ్ముఁడుఁ దన్ను గొల్చిరా
వశజనమానసప్రియుఁడు వచ్చి చరింపుచు దండకాటవిన్
విశదగతి న్వసించె నతివిశ్రుతపంచవటీతటంబునన్.

45


గీ.

అంత మారీచవిరచితవ్యాజయుక్తి
రాజసుతులను వంచించి రావణుండు
తపసివేషంబుఁ గైకొని ధర్మ మెడలి
జానకీదేవిని హరించె సాహసమున.

46


మ.

అనఘుం డంతట రాఘవేశ్వరుఁ డరణ్యక్షోణులన్ మేదినీ
తనయాన్వేషణ మాచరించుచు సముద్యల్లీలఁ గాంచెన్ మహా
స్వనదంభోజవసద్విరేఫబకహంసక్రౌంచవంద్యుక్తిగుం
భవశుంభజ్జలరాట్సభాభవనముం బంపాసరోరాజమున్.

47


వ.

మఱియు నాసరోవరంబున రసభరితబిసఖండంబులు భుజించుతరి
నెడనెడం బొడము పిపాసవలన శతపత్రపాత్రనిక్షిప్తమకరంద
పానీయంబులు గ్రోలుచు నుద్వేలానురాగంబునం దద్బిందుకణం