పుట:రామేశ్వరమాహాత్మ్యము (ఏనుగు లక్ష్మణకవి).pdf/11

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

10

రామేశ్వరమాహాత్మ్యము


క.

ఆసమయంబున వేద
వ్యాసునిశిష్యుండు మౌనివర్యుఁడుని త్యో
ల్లాసుఁడు సూతుఁడు కథికా
గ్రేసరుఁ డచ్చటికి వచ్చెఁ గీర్తితభంగిన్.

7


చ.

అనలునిభంగిఁ దేజరిలు నమ్ముని నమ్మునినాథు లాదరం
బునఁ గని యర్ఘ్యపాద్యముల బూజనము ల్దగఁజేసి యున్నతా
సన మిడి చాలభక్తినిఁ బ్రసన్నునిఁ జేసి జగద్ధితార్థ మిం
పెనయఁగ వార లిట్లడిగి రిమ్ముల నొక్కమహారహస్యమున్.

8


క.

సూతా వింటివి సత్యవ
తీతనయునివలన సకలదివ్యపురాణ
వ్రాతంబులు జగదేక
ఖ్యాతగుణా నీకుఁ దెలియు నఖిలార్ధములున్.

9


క.

ఎయ్యవి పుణ్యక్షేత్రము
లెయ్యవి తీర్థోత్తమంబు లివ్వసుమతిలో
నెయ్యెడ లభించు మోక్షము
చయ్యన జనులకు భవోగ్రజలనిధివలనన్.

10


గీ.

ఎవ్విధమున నుమేశరమేశభక్తి
గలుగు నరులకు నెద్దానివలన దొరకుఁ
ద్రివిధకర్మఫలం బిది తెలియఁబలుకు
మాదరంబున మాకు మహామునీంద్ర.

11


క.

మునివరు లిట్లడిగిన వ్యా
సునకుం బ్రణమిల్లి పలికె సూతుండు తపో
ధనులార మంచిప్రశ్నం
బొనర్చితిరి లోకహితము యోజించి మదిన్.

12


ఆ.

ఈరహస్యతత్త్వ మిపు డేను లెస్స వ
చింతు మీకు మునుపు చెప్పలేదు