రామాయణ విశేషములు
17
ఈ నిదర్శనాలనుబట్టి సిరియాప్రాంతాలకు హిందువులు క్రీస్తునకు పూర్వము 3000 ఏండ్లక్రిందటనే వెళ్ళియుండిరని పాశ్చాత్యులే వ్రాసియున్నారు. క్రీ. పూ. 2635 లో అక్కడ్ (సిరియా ప్రాంతములోని దేశము) రాజగు సర్గాం అనువాడు ఏషియామైనరులోని “పురుషఖండము” రాజైన నూర్‌దగన్ అనువానిపై దాడివెడలెను. నేటికి ఇంచుమించు 4600 ఏండ్ల క్రిందట సిరియాప్రాంతములో పురుషఖండ రాజ్యముండెను. [1] దీనినిబట్టి రామాయణగాథను గ్రీకుకవి క్రీ. పూ. 800 లేక 900 ఏండ్ల నాడు వినియుండుట ఆశ్చర్యకరము కాదు. పైగా ఇంచుమించు ఏడెనిమిది నూర్ల ఏండ్ల కాలములో అనగా క్రీస్తుపూర్వము 150 నాటివరకు ఇలియడును దిద్దుచునే వచ్చినారు. కావున దాని తుది స్వరూపము క్రీ. పూ. 150 లో ఏర్పడెను.
ఇంతేకాక గ్రీసుదేశానికి సమీపములోఉండే ఛాల్డియాదేశములో క్రీస్తునకు పూర్వము 3000 ఏండ్ల క్రిందట పంపబడిన ఇండియా టేకు దూలములు కనబడినవి. టేకుకట్టె ఇండియాలో తప్ప మరెచ్చటను లేకుండెను అని మిస్ రగోజన్ (Vedic India) లో వ్రాసెను. ఆమె యింకను ఇట్లు వ్రాసెను: “బాబిలోనియాలో హిందువులు నేసిన బట్టలను 'సింధు' అను పేరుతో వ్యవహరించిరి " సాలమన్ కాలములో ఇండియా నుండి యెగుమతి యయిన చందనము, దంతము, కోతులు, నెమళ్ళు మున్నగు భారతీయ వస్తువులకు హీబ్రూ భాషలో పేరులు లేనందున
భారతీయనామములతోనే వ్యవహరించిరి. ఇట్టి ప్రమాణాలనుబట్టి హోమరుకంటే ఎన్నియో శతాబ్దములకు పూర్వమే హిందూవ్యాపారులు, వైదిక మతబోధకులు, గ్రీసు దేశమువరకు కూడా వెళ్ళివచ్చుచుండిరని స్పష్టమగుచున్నది.
- ↑ హట్టి(Hithite)ని గుఱించి ఇంకను వివరాలు తెలుసుకొనగోరువారు ఎన్ సైక్లోపీడియా బ్రిటానికాలో పై ఇంగ్లీషు పదమువద్ద చూచుకొనగలరు.