పుట:రామాయణ విశేషములు.pdf/62

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

12

రామాయణ విశేషములు

రామాయణము ఆర్యుల కాదర్శగ్రంథము. అందలి యుత్తమ పాత్ర లన్నియు మన కాదర్శపాత్రములే. రామునివంటి రాజు, సీతవంటి భార్య,, హనుమంతునివంటి బంటు, లక్ష్మణునివంటి సోదరుడు, భరతుని వంటి భక్తుడు, సుగ్రీవుని వంటి స్నేహితుడు, దశరథుని వంటి కరుణామయమూర్తి, ప్రపంచ వాఙ్మయములో నెందును సృష్టికాలేదు. వెయ్యేండ్ల నుండియు పరాధీనతయే సంప్రాప్తమైనను హిందువులలో నేటికిని విశేషముగా ధార్మికగుణాలు వ్యక్తమగుచున్నవంటే దానికి కారణము శ్రీమద్రామాయణమే! చదువురానివారికిని, స్త్రీలకును, అస్పృశ్యబ్రువులకును, తక్కువకులా లనబడు వారికిని బోధచేయు దిక్కేలేని సంప్రదాయములో నీతివర్తనము పట్టుకొనివచ్చినదంటే అది శ్రీమద్రామాయణ మాహాత్మ్యమే. సీత పేరు, సీత కథను వినని హిందూ దౌర్భాగ్యులు లేనేలేరు. రామాయణములో హిందువులకు పై విశేషాలే కానవచ్చుచుండును. కాని దాని నర్థము చేసుకోలేని కొందరిపాశ్చాత్యుల కందు కోతులు, భూతాలు, తిక్కకథలు, నమ్మగారానిముచ్చటలు - ఇట్టివే కనబడుచుండును. తమ హోమరులో ఇంతకుమించినవి ఎన్ని యున్నను అవి వారికి కానరావు.

ఇలియడ్ పురాణము


హోమరువ్రాసిన ఇలియడు పురాణమును మన రామాయణముతో లంకెపెట్టినందున ఇలియడ్ పురాణకథను కట్టె, కొట్టె, తెచ్చెనన్న మాదిరి సంగ్రహముగా వ్రాయుచున్నాను.

పూర్వకాలములో ట్రాయి అను ఒక గొప్ప నగరముండెను. దాని రాజుపేరు ప్రియం. అతనికి హెక్టరు అను కొడుకును, ప్యారిసు అను వాడును మరికొందరు కుమారులును కలిగిరి. ప్యారిస్‌మూలాన ముందుకాలంలో దేశానికి ప్రమాదమున్నదని జ్యోతిష్కులు చెప్పినందున వాడు