పుట:రామాయణ విశేషములు.pdf/57

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రామాయణ విశేషములు

7

వాల్మీకి యెవరు ?

వాల్మీకినిగురించి యించుమించు మనకేమియు తెలియదు. అతడు వ్యాధుడుగా నుండెననియు, అడవులలో దొంగల గుంపు పెద్దయై బాటసారులను దోచి జీవించుచుండెననియు, నారదాదు లొకనాడు అతని బారి పడిరనియు, వారు 'ఓయీ! నీవు చేయు పాపకర్మలను నీవే యనుభవింతువా? అందు భాగస్వాములున్నారా?' యని యడుగగానే నేనెవ్వరిని పోషించుచున్నానో వారందరు భాగస్థులగుదురని చెప్పెననియు, ఆ సంగతి నీ భార్యాపుత్రుల విచారించి చూడుమని చెప్పగా, చూతముగాక యని తనవారి నడుగగా వారికి పాపములో భాగముండదని రనియు, అప్పుడతడు విరక్తుడై మునుల యుపదేశము నొంది తపస్సు చేసెననియు, అట్టి యాచరణలో అతనిపై వల్మీకము (పుట్ట) పెరిగెననియు, అందుచేత వాల్మీకిపదవాచ్యుడయ్యెననియు, తపశ్శక్తిచే మహర్షియైన తర్వాత రామాయణమును రచించెననియు ఒక గాథ కలదు. దాని కాధారము సరియైనది కానరాదు. వల్మీకము పెరిగిన తర్వాత వాల్మీకియైనచో అంతకుముందతని పేరేమైయుండెనో ఎవ్వరును తెలుపలేదు.

వాల్మీకి రాముని సమకాలికుడనియు తమసానదీతీరమున శిష్యులతో కూడ ఆశ్రమము స్థాపించి యందుండెననియు, అతడే యాదికవి యనియు శ్రీ మద్రామాయణమందు కానవచ్చుచున్నది. శ్రీమద్రామాయణ ములో ఉత్తరకాండను విమర్శకులు ప్రాచీనముగా నంగీకరింపలేదు. రామాయణములోని మొట్టమొదటి సర్గలోనే రామాయణ కథా సంగ్రహము నారదవాక్యముగా వ్రాయబడినది. అందు అన్నిటిని చెప్పినారు. కాని ఉతరకాండలోని విషయాలేమియు తెలుపలేదు. ఉతరకాండలో అపవాదభీరువై యుండిన శ్రీరాముడు సీతను పరిత్యజించినప్పుడు ఆమె గర్భవతిగా నుండెననియు, ఆమెకు వాల్మీక్యాశ్రషములో ఆశ్రయము లభించెననియు వ్రాసినారు.