పుట:రామాయణ విశేషములు.pdf/56

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

6

రామాయణ విశేషములు

సంస్కృత సకారము ఫార్సీలో హకారముగా మారును. ఫార్సీవారి భాషలో “అహుర” మంచి దేవత “దేవ" "దుష్ట" దేవత. దీనినిబట్టి అహురుల గురువగు భృగువు పారసీకులకు ముఖ్య గురువై యుండెను” అని జతీంద్రమోహన ఛటర్జీ గారు “గాథా” జరుథుస్త్ర మత గ్రంథ పీఠికలో వ్రాయుచు మరల ఇట్లు తెలిపినారు. అథర్వవేదమునకు "భృగ్వంగిరసి" అను పేరుకలదు. అథర్వ వేదమందొక భాగమునకు భృగువు ద్రష్ట. ఇంకొక భాగానికి అంగిరసుడు ద్రష్ట. భృగువు లేక శుక్రుడు అసురుల గురువు. అంగిరసుడు లేక బృహస్పతి సురల గురువు. అథర్వ వేదములోని భృగుసంహితా భాగము ఖిలమైనదని ఆర్యులందురనియు, ఆ భృగుసంహితయే “గాథా” “అవెస్తా" అను రూపమున జరథుస్త్రునిచే ఈరాన్ దేశమందు వ్యాప్తినొందింపబడెననియు ఈ ఛటర్జీగారి వాదము. పాశ్చాత్య పరిశోధకులు కొందఱిట్టి అభిప్రాయమునే వెల్లడించియున్నారు. అథర్వ వేద కాలములో దేవాసుర పూజా పద్ధతిలో ఆర్యులలో భిన్నాభిప్రాయము లేర్పడెననియు అసురపూజాభి మానులు ఈరానులోనికి వెళ్ళిరనియు వారికి జరథుస్త్రుడు మతకర్త యయ్యెననియు పాశ్చాత్యపండితుల యభిప్రాయము. 'గాథా' గ్రంథములోని భాషయు వేదతుల్యముగా నుండుట ఆశ్చర్యజనకముగా నున్నది. ఉదాహరణార్థముగా “గాథ" లోని మొట్టమొదటి సూక్తము నుదాహరించు చున్నాను. 'యానీం మనోయానీం వచోయానీంస్య ఓధనేం అషఓనో జరథుస్త్రహే.' దానికి సంస్కృత సామ్యమును ఛటర్జీపండితుడీవిధముగా చూపించినాడు:


జినంమనః జినంవచః జినం స్యోదనం అషవనః జరథుస్త్రస్య.

ఈ విధముగా భృగువంశమువాడు చ్యవనుడు. చ్యవనుని కుమారుడు వాల్మీకియై యుండినచో వీరు ఈరాన్ సంబంధముకూడ కలవారని యూహింపవలసివచ్చును.