పుట:రామాయణ విశేషములు.pdf/54

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

4

రామాయణ విశేషములు

వాల్మీకి రామాయణమే. అయితే వాల్మీకికంటెముందుగా మరొకరెవరైనా రామచరిత్రమును వ్రాసిరా? అని విచారించిన చ్యవనుడు అనునతడు రచించియుండెనని నందార్గికర్ పండితుడు క్రీ. శ. 1897 లో వ్రాసెను. దానికి మూలాధారము అశ్వఘోషుని బుద్ధచరితములోని యొక శ్లోకభాగము. అశ్వఘోషుడు కాశిదాసుకంటె పూర్వుడనియు, కొంచెము తర్వాతి వాడనియు క్రీస్తుశకారంభము వాడనియు క్రీస్తుశకములో ఆరవ శతాబ్దమువాడనియు చర్చలు కలవు. అవి మనకిప్పుడు ప్రధానములు కావు. అశ్వఘోషు డిట్లువ్రాసెను.


వాల్మీకినాదశ్చ ససర్జ కావ్యం, జగ్రంథ యన్న చ్యవనో మహర్షిః
చికిత్సితం యచ్చ చకార నాత్రిః, పశ్చాత్త దాత్రేయ ఋషిర్జగాద - బుద్ధచరిత. 1 - 49.

"చ్యవనమహర్షి యేది రచింపజాలకపోయెనో అట్టి కావ్యాన్ని వాల్మీకి రచించెను. అత్రి యేవైద్యమును చేయజాలకపోయెనో దానిని అతని కుమారుడగు ఆత్రేయుడు పూర్తిచేసెను." అని పై శ్లోకము యొక్క అర్థము. దీనిని బట్టి చ్యవన మహర్షి రామాయణమును బాగా రచింపజాలక యేదో యొకరీతిగా వ్రాసినదానిని వాల్మీకి సమగ్రముగా పెంచి వ్రాసినాడని కొందరు వాదింపవచ్చును. కాని యట్టి యర్థాని కవకాశములేదు. అశ్వఘోషుడీ శ్లోకాన్ని రచించిన పూర్వాపర సందర్భాలను గమనింపవలెను. బుద్ధుని తండ్రి చేయలేనిపనిని బుద్ధుడు చేసెను అను వంశాన్ని వర్ణించుచు అత్రి చేయలేని పనిని అతని కుమారుడగు ఆత్రేయుడు చేసెను. అట్లే చ్యవనుడు చేయనిపనిని వాల్మీకి చేసెనని యుపమాన వాక్యములచే నిరూపించెను. అయితే రామాయణానికేమియు సంబంధములేకుండిన చ్యవనుని పేరెందుకెత్తుకొన్నాడు? అని ప్రశ్నింప వచ్చును. చ్యవనుడు భృగువంశమువాడు. వాల్మీకియు భృగువంశమువాడు.[1] బుద్ధఘోషుడు తండ్రి కొడుకుల ఉపమానములనే ఇచ్చి
  1. ఋక్షో౽భూద్భార్గవస్తస్మా ద్వాల్మీకి ర్యో౽భిధీయతే - విష్ణు పురాణము 3. 3.