2
రామాయణ విశేషములు
పురుషోత్తముడు. ఆతనిలో ఏ లోపమును లేదు. అతడు సాక్షాద్విష్ణు భగవానుడే. సీతాదేవి అపరలక్ష్మీదేవియే. రామునిబంటు అయిన హనుమంతుడును దేవుడే. అతనినెందరో కులదైవతముగా పూజించుచున్నారు. రామాయణము భక్తి ప్రధాన గ్రంథము. అందు వేదాంత రహస్యము లున్నవని పండితులు పెద్ద పెద్ద వ్యాఖ్యలు వ్రాసినారు. ఇట్టి భావ పరంపరలచే హిందువులు, అందు ముఖ్యముగా వైష్ణవులు, శ్రీమద్రామాయణమును పూజించువారై యున్నారు. రెండవ వర్గమువారు శ్రీరామచంద్రుని ఆదర్శ మహాపురుషునిగా స్వీకరించుచున్నారు. కేవలము చారిత్రిక దృష్టితోనే విమర్శించుచున్నారు. ఈ దృష్టితో చూచువారు ఒక్కొక్కప్పుడు అస్తినాస్తి విచికిత్సలో తటపటాయించుచున్నారు. యథార్థముగా శ్రీరాముడు చారిత్రికపురుషుడేనా యని సంశయించుచున్నారు. రామాయణమును ఒక ఆదర్శనీతిదాయకమగు కథగా కల్పించి యుండరాదా? అని వాదింతురు. కొందరు పాశ్చాత్య విమర్శకులు రామాయణకథ కల్పితకథ యని యభిప్రాయపడినారు. వెబర్ అను వాడిట్లు వ్రాసెను: "ఆర్యులు దక్షిణాపథమును సింహళమును ఆక్రమించుకొన్న నిరూపక గాథ రామాయణము. రామాయణ పాత్రలన్నియు కల్పితములే. సీతయన నాగటిచాలు. నాగటిచాలుపూజను తెలుపునట్టిదీ కథ."
జాకోబీ యిట్లువ్రాసెను: "వేదములలోని వృత్రవధయే రామాయణమునకు మూలము. రాము డింద్రుడు. వృత్రుడు రావణుడు. వేదాలలో మరుత్తులు (గాడ్పులు) ఇంద్రుని మిత్రులు. ఇచ్చట గాడ్పుకొడుకు - హనుమంతుడు - రామునికి ముఖ్యుడు. సీత నాగటిచాలు. వృత్రుని చంపి మేఘాలను నాగటి చాళ్ళకు విడిపించినవాడు ఇంద్రుడు లేక రాముడు."
పర్గిటర్ రామాయణము యథార్థగాథ యని యభిప్రాయపడెను. "ప్రాచీనపు ఇతిహాసములను శ్రద్ధతో పరికించి శోధించిన తర్వాత