పుట:రామాయణ విశేషములు.pdf/51

ఈ పుట అచ్చుదిద్దబడ్డది
రామాయణము-
ఇలియడ్ పురాణము

"వాల్మీకే ర్మునిసింహస్య కవితావనచారిణః
శ్రుణ్వన్ రామకథానాదం కో నయాతి పరాంగతిమ్?"


శ్రీ మద్రామాయణ మహాకావ్యమునుగురించి నావంటివాడు వ్రాయుట మహాసాహసమే! ఎందరో ప్రాచ్యపాశ్చాత్య పండితులు వాల్మీకి రచిత రామాయణ మహాకావ్యమును గురించి విపులముగా చర్చించి యున్నారు. హిందువు లందరికిని శ్రీమద్రామాయణముపై నుండునంతటి భక్తి ప్రేమాదరములు ప్రపంచములోని మరే గ్రంథముపైనను లేవు. వాల్మీకి రచితమగు గ్రంథము ఆది కావ్యము. రాముడన్న నో, సాక్షా ద్విష్ణ్వవతార పురుషుడుగా హిందువులచే పూజింపబడునట్టి దేవుడు. హిందూ పండితులు నేటివరకును రామాయణములో అవతార తత్త్వమును, ఆధ్యాత్మిక విషయమును విశేషముగా చర్చించిరి. కాని యితరాంశములు కూడ తెలుసుకొనదగినవై యున్నవి.

రామాయణమును గురించి యాధ్యాత్మికపరముగాను, చారిత్రికముగాను రెండు విధములగు విమర్శన పద్ధతులు కనబడుచున్నవి. ఆధ్యాత్మికముగా పరిశీలించు మొదటి వర్గము వారికి రాముడు అవతార పురుషుఁడు,