పుట:రామాయణ విశేషములు.pdf/45

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

xLiii

ఇమ్మహాకావ్యమునుజదివి యొకానొక ప్రాజ్ఞుఁడిందు,


శ్లో. తదుపగతసమాస సంధియోగం
    సమ మధురోపనతార్థ వాక్యబద్ధం
    రఘువరచరితం మునిప్రణీతం
    దశశిరసశ్చవధం నిశామయధ్వం.

అను శ్లోకమును నుచితస్థానమునఁ బ్రతిష్ఠించియున్నాడు. పదమంజిమ యందేమి, సంధిసమాస విన్యాస చాతురీవిశేషమునందేమి, యీ మహాకావ్యము తరువాతఁ బుట్టిన కావ్యము లన్నింటికిని మేలుబంతియన నొప్పుచున్నది. “గతింఖర ఇవాశ్వస్య" అని యమ్మహాకవి యేదో సందర్భమునఁ జెప్పినట్లు తచ్ల్ఛోకగతి యనన్య సామాన్యమైనది. చరిత్ర శోధనపద్ధతిలో నీ కావ్యవిశేషముల కొకింత విలువ తగ్గించి చూచినను సాహిత్యశోధన పద్ధతిలో నీ కావ్యమనర్ఘ మనక తప్పదు. ఇందలి యనేక విషయములు సమూలములేయనఁదగియున్నవి. తక్కినవి సైత ముద్దేశ పూర్వకముగా గావింపఁబడిన మార్పులేయన నొప్పును. గ్రంథమంతయు గాకున్నను జాలభాగ మొకేచేతఁ దీర్చి పెట్టఁబడిన విచిత్రశిల్పమనియే తలంపఁదగియున్నది. శ్రీ పెండ్యాల సుబ్రహ్మణ్యశాస్త్రిగారన్నట్లు మహారామాయణకవి ప్రాకృత వ్యాకరణకర్తయగు వాల్మీకియైయుండిన నుండవచ్చును. అమ్మహాకవి కీనామము రామాయణరచనవలనఁ గలిగిన బిరుదనామ మగునేమో!

తుదిమాట

శ్రీ రెడ్డిగారు తఱచుగా నేఁటి ప్రాచ్య పాశ్చాత్య విమర్శకులు రామాయణమునుగూర్చిచేసిన విమర్శల నన్నింటిని గ్రోడీకరించి చూపియు వాని సత్యాసత్యముల ననేకవిధములఁ జర్చించియు గుణమును స్వీకరించియు దోషమును నిరాకరించియు 'రామాయణ విశేషములు'