పుట:రామాయణ విశేషములు.pdf/39

ఈ పుట ఆమోదించబడ్డది

xxxvii

నైరృతికి సూటిగాఁ బోయినచో గోకర్ణక్షేత్రము చేరఁగలమో ఆ మార్గమున కనుకూల ప్రాంతమైన గోదావరీతీరమే శూర్పణఖాదర్శనస్థానమైన ప్రదేశము కాఁదగియున్నది. కావున పై వివాదమున కాస్పదము లేదన వచ్చును. అటు నాసికాక్షేత్రమునుగాక యిటు భద్రాచలమునుగాక యా రెంటి మధ్యప్రదేశము రాముని పర్ణశాలా స్థానమనవలెను. ఇట్టి యీ స్థానమునకును రామునికాలమువాఁడుగాఁ దేలిన భరద్వాజునికిని మిక్కిలి సంబంధమున్నట్లుగూఁడ బైఁ జెప్పఁబడిన వాయుపురాణమునందలి భారత భూవర్ణన ప్రకరణమునఁ గొన్ని చక్కని శ్లోకములున్నవి. చూడుడు:

భరద్వాజుఁడు


           శ్లో. సహ్యస్యచోత్తరార్థేతు యత్ర గోదావరీనదీ
               పృథివ్యామిహకృత్స్నాయాం సప్రదేశో మనోరమః
              (తత్ర గోవర్థనోనామ సురరాజేన నిర్మితః)
               రామప్రియార్థం స్వర్గోఽయం వృక్షా ఓషధయస్తధా
              భరద్వాజేన మునినాత్ప్రతియార్థేఽవతారితాః
              అంతఃపురవరోద్దేశస్తేన రాజ్ఞే మనోరమః

సహ్యపర్వతోత్తరార్ధమున గోదావరీనది ప్రవహించు ప్రదేశము మిగుల రమణీయమైనదట. భూమి కంతటికిని నంతరమ్య ప్రదేశముమాత్ర మొక్కటి లేదట. (కుండలీకృతభాగము కొన్ని ప్రతుల లేదు). ఇట్టి యీ స్వర్గసుఖకారియైన ప్రదేశము వృక్షౌషధీయుక్తముగా రామునికిఁ బ్రీతి చేకూర్ప భరద్వాజమునిచే నవతరింపఁజేయఁబడినదట.

ఇందువలన భరద్వాజమునికిని రామునకును గాఢసంబంధ మున్నదని మనము నిశ్చయింపవచ్చును. ఇట్టి యీ భరద్వాజుడు భారత కథానాయకుల ధనురాచార్యునకుఁ తండ్రి యని భారతమునం దున్నది. కాఁబట్టి ద్రోణ భీష్మ వ్యాసులు రాము నెఱింగియుందురనవలెను.