పుట:రామాయణ విశేషములు.pdf/330

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

280

రామాయణ విశేషములు

యుండెను. తర్వాత కాలములో రాక్షసులతో ఆర్యులు బాంధవ్యములు చేసిరి. భీమసేనుడు హిడింబను వివాహమాడెను. రాక్షసులు ఘోర రూపులైన, నరభక్షకులైన, శ్రీకృష్ణుని బావమరిదితో వారికి బాంధవ్య మెట్లు పొసగెను? కావున, రాక్షసులు మంచి నాగరకత చెందినవారని తోచుచున్నది. ఆర్యులు రాక్షసులను లోబరచుకొనుటకై ప్రయత్నించిరి. రాక్షసులు ఆత్మ స్వాతంత్ర్యమును కాపాడుటకై పోరాడిరి. ఆ సంఘర్ష ణలలో సీతాపహరణమువంటి ఘట్టములు సంభవించెను. మరి దానికి మూలకారణమేమి? శూర్పణఖకు ముక్కు చెవులు కోయుట. శూర్పణఖ కామచారిణి. అది తప్పా? ఏ కాలములో ఏ జాతిలో ఏ యాచారము లుండెనో ఆ దృష్టితోనే విచారింపవలెను. కాని దేశకాలాచారాంతరములచే విమర్శింపరాదు. మహాభారత కాలమునకు ముందు కాలములో ఆర్య స్త్రీలు అనావృతలుగాను, స్వేచ్చాచారిణులుగాను ఉండిరని పాండురాజు కుంతితో చెప్పలేదా? దీర్ఘతముడను బ్రాహ్మణుడు కాశీరాజు భార్యలను పొంది సంతానోత్పత్తి కావింపలేదా? శూర్పణఖ చేసిన యా తప్పునకు ముక్కు చెవులు కోసిరి. అది ఆర్య ధర్మములో తప్పు కాకపోవచ్చును. రాక్షస వివాహాలలో శత్రువుల స్త్రీలను ఎత్తుకొనిపోవుట ఆర్య ధర్మముల ప్రకారము తప్పు. ఈ విధముగా ఆర్యులకును అనార్య రాక్షసులకును నిరంతరము సంఘర్షణలు జరిగెను. మేలైనఆయుధాలు, ధనుర్విద్య ఆర్యులలో నుండెను. వారే జయించిరి. దక్షిణా పథము ఆర్యులకు దాసోహం అని ఆక్రోశించెను.