పుట:రామాయణ విశేషములు.pdf/328

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

278

రామాయణ విశేషములు

ఒక సంవత్సరమువరకు మాత్రమెందుకు గడువిచ్చెను ? అది రాక్షసాచారము. ప్రాచీనకాలములో అష్టవిధ వివాహము లుండెను. అందు రాక్షస వివాహమొకటి నింద్యమైన దుండెను. రాక్షస వివాహ స్వరూప మును మను విట్లు నిరూపించెను:


“హత్వా ఛిత్వా చ భిత్వా చ క్రోశంతీం రుదతీం గృహాత్,
ప్రసహ్య కన్యాహరణం రాక్షసో విధి రుచ్యతే". (3-33)


ఇట్టి రాక్షస వివాహాలలో ఒల్లని కన్యకలకు ఒక సంవత్సర కాలము గడువిచ్చుచుండినట్లు కానవచ్చుచున్నది. మహాభారతములో రాక్షసముగా కొనిపోబడిన స్త్రీలకు ఒక సంవత్సరపు గడువునిత్తురని తెలిపినారని సి. పి. వైద్యాగారు (Riddle of the Ramayanam) లో వ్రాసినారు. కాని ఆ మాట యెచ్చటనున్నదో నిరూపించలేదు. రావణు డును తన కులాచారప్రకారము ఒక సంవత్సరము గడువు నిచ్చినట్లు తోచుచున్నది.

రాక్షసులలో మంచి నాగరకత యుండెనని తెలుపుచు ప్రాసంగిక ముగా రాక్షస వివాహచర్చ చేయబడెను. రాక్షసులు వైద్యవిద్యను బాగా నెరిగియుండిరి. కుంభకర్ణుడు చనిపోయిన తర్వాత రాక్షసవీరులు కత్తి దెబ్బలను గాయములను మాన్పునట్టి ఔషధములను పూసికొని యుద్ధ మునకు వెళ్ళిరి.


“సర్వౌషధీభి ర్గంధైశ్చ సమాలభ్య మహాబలాః".
                                                         యుద్ధ. 69-18.


ఈ యౌషధము లెట్టివో వ్యాఖ్యాతలిట్లు తెలిపినారు: “కోష్ఠం, మాంసి, హరిద్రేద్వే, మురా, శైలేయ, చందనే, త్వచా, చంపక, మస్తాశ్చ, సర్వౌషద్యోదశస్మృతాః". కోష్టు, జటామాంసి, పసుపు