పుట:రామాయణ విశేషములు.pdf/320

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

270

రామాయణ విశేషములు

ఆఫ్‌గనిస్థానుకు పశ్చిమోత్తరమందుండియుందురు. ఆ ప్రాంతములో ఆరల్ సముద్రము (Sea of Aral) కలదు. దానిలోనికి అరక్షస్ (Araxes) అను నది పారుచున్నది. రకార(రేఫ)మునకు ముందు అ,ఇ,ఉ అను నచ్చులుపయోగించి పలుకుట బహుప్రాంతాలలో ముఖ్య ముగా ద్రావిడులలో, శకజాతులలో వర్తించు నాచారము. తమిళములోని ఉరల్ మన రోలు. ఇట్టి వనేకముగా కలవు. అరబ్బులు అల్ శబ్దమును పదాలకు చేర్చుదురు. ఇర్రహిమాన్, ఇర్రహీం ఇత్యాదులు కలవు. కావున అరక్షన్ అనునదే రక్షన్ అయినది. అరక్షస్ నదీ ప్రాంతవాసులే రక్షస్సులు-రక్షోగుణమువారు. వేదాలలో రక్షన్‌శబ్దమేకలదుకాని రాక్షస శబ్దములేదని తలతును. రాక్షసశబ్దము పౌరాణికులదిగా కానవస్తున్నది. అదే విధముగా అసుర అనుదానిలో అకారము న ఙర్థములో తీసుకొని దాన్ని తొలగించి సుర శబ్దమును కల్పించినది ఉపనిషత్తులకాలము నుండియే. కావున అరక్షస్ నదీప్రాంతవాసులే రాక్షసులై యుండిరని నా యభిప్రాయము.

రామాయణమందు ప్రారంభమందే, 'నిషాద' శబ్దము కలదు. దానిపైననే శ్లోకమారంభమయ్యెనందురు. గుహుడు నిషాదరాజు. (అయో. 50-33) రామునికాలమందు నిషాదుల “భక్ష్యభోజ్యపేయ లేహ్యములు" (50-39) రాముని కంగీకారయోగ్యములుగా నుండెను. కాని అమరునికాలమువరకు నిషాదులు చండాలురైరి! నిషాదు లెవ్వరు? వా రాటవికులైయుందురు. హిందూకుష్ పర్వతమునే నిషధపర్వత మనిరి. పూర్వము దానినే నిషద లేక నిషాదపర్వత మనిరి. అర్రియన్ అను ప్రాచీన గ్రీకు చరిత్రకారుడు దానిని “నిస” (Nysa) అనెను. టాలమీ దానినే పరోప-నిసస్ (Paropa - Nisos) అనెను. అచ్చటి ఆదిమనివాసులే నిషాదులు. గాంధారలోని గాంధర్వులవలెనె నిషదలోని నిషాదులును మంచి గాయకులై యుందురు. అందుచే "నిషాదర్షభగాంధార షడ్జమధ్యమధైవతాః" అని యమరుడు వ్రాసెను.