పుట:రామాయణ విశేషములు.pdf/30

ఈ పుట ఆమోదించబడ్డది

xxviii

వంశములందు వానికి మూలములై శ్రీరామ పాండవ శ్రీకృష్ణ చరిత్రాత్మకములైన యాఖ్యానములు తదారంభముననే నిక్షేపింపఁబడినవి. వాని ప్రాధాన్యమును గ్రహింపఁజాలని విమర్శకులు తత్తన్మహా గ్రంథకర్తలు మొదట వ్రాసి పెట్టుకొనిన విషయసూచికలుగా భావించి చేఁజేత వదలుచున్నారు. నేను శ్రీ లాలా లజపత్రాయి బంకించంద్ర చటర్జీ వగైరాలు వ్రాసిన శ్రీకృష్ణచరిత్రములఁ జూచి యవి వట్టి యూహామాత్రములగుట గమనించి సరియైన చరిత్ర ప్రమాణములు గలవేమో యని వెదకుచుండ హరివంశములో వేదవ్యాస విరచితమనఁదగి “ఇత్యువాచ పురావాస స్తపో నీర్యేణ చక్షుషా" అను నుపసంహారముగల యొక యాఖ్యానము గానరాగా దానిని బరికించి సత్యమును నిర్దరించి తద్వ్యాఖ్యానప్రాయముగనే శ్రీకృష్ణ చరిత్రమును వ్రాసియున్నాను. అందు మహాభారతాదిని "తతోధ్యర్థ శతం భూయః శుకమధ్యాపయన్మునిః" అను నారంభముగల 150 శ్లోకములుండ వలసిన యొక భారతాఖ్యానమునుగూడఁ బరీక్షించి మహాభారతకథ కది మూలమని సైతము నిశ్చయించియున్నాను. కాని నా యితర గ్రంథముల వలెనే అదియు "జీర్ణమంగే సుభాషితం" అన్న విధముగా నంగమునఁ గాకున్న నా ప్రాతపెట్టెలలో శిథిలమగుచున్నది. ఇది నా యదృష్ట విశేషము. ఈ కృష్ణచరిత్రమును శ్రీ రెడ్డిగారు పలుమారువిని దాని ముద్రణనిమిత్తము గొంత ప్రయత్నించియు లబ్ధమనోరథులు కాఁజాల రైరి. సరి-ప్రసక్తానుప్రసక్తమైన నా యీ యప్రకృత ప్రసంగమునకుఁ బాఠకులు క్షమింతురుగాక.

మహారామాయణములోని బాలకాండకుఁ బైఁ జెప్పబడిన సంక్షేప రామాయణములో నేమాత్ర మాస్పదములేదు. అందు రామపట్టాభిషేక ప్రయత్నమును దద్విఘ్నమును గథారంభవిషయములుగానున్నవి. కావున నయోధ్యకాండమే రామాయణమున కాదిమభాగమని తలంపఁదగును.