పుట:రామాయణ విశేషములు.pdf/26

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

xxiv

విమర్శనము వ్రాసి పెక్కండ్ర నిందలకు బాల్పడి యున్నాను గాన నా కది క్రొత్తగాదు. శ్రీ రెడ్డిగారుగాని నేనుగాని దీనిని విభూతిలో ప్రకటించిన శ్రీ వీరభద్రశర్మగారుగాని రామునియందు భక్తి లేనివార మని చెప్పుటమాత్రము సత్యమునకు బహుదూరమై యున్నది. నాచే పవిత్ర రామనామ స్మరణమే నిద్రనుండి లేచునపుడు, పండుకొనునప్పుడు, భుజించునపుడు సర్వకాల సర్వావస్థలయందు స్మరణీయ మగుచున్నది. అదియే తరణోపాయమని దృఢముగ దలఁచువాఁడను. కాని కథాదికమును విమర్శించుట మాత్రము నా ముఖ్యకార్యముగఁ దలతును.

శ్రీ రెడ్డిగారి రచనా విధానము ధారాశుద్ధిగలిగి ఆకర్షణీయముగ నున్నదికాని నాకందుగల వాడుకపదముల ప్రయోగము మాత్రము మనస్సునకు విరుద్ధమైనది అని సాహసించి చెప్పుచున్నాను.

పిఠాపురము

పెండ్యాల వేంకట సుబ్రహ్మణ్యశాస్త్రి

ది. 31-8-43