పుట:రామాయణ విశేషములు.pdf/20

ఈ పుట ఆమోదించబడ్డది

xviii

గాథలను చేర్చియుండుటచే కాళిదాసునకు పూర్వముననే దృశ్యమాన వాల్మీకి రామాయణము పూర్తియైనదని చెప్పనగుచున్నది. మరియు అయోధ్యకాండలోని భరత శ్రీరాముల సంభాషణమునందలి రాజనీతి శ్లోకములను మహాభారతాంతర్గతమగు సభాపర్వములోని నారదుడు ధర్మజునకు జెప్పిన రాజనీతి విశేషములే. అట్లే సుందరకాండలోని సీతావర్ణనము మహాభారతములోని అరణ్యపర్వాంతర్గతమగు దమయంతీ వర్ణనము లేక రూపములే భారతకర్త వాల్మీకమునుండి దొంగిలించెనా? వాల్మీకి భారతమునుండి యపహరించెనా? నాకుఁ జూడ దృశ్యమాన వాల్మీకి రామాయణములోని బెక్కు శ్లోకములు భారతాదులనుండి కైకొన బడినవనియే యని తలంచుచున్నాను.

మరియు మహాభారతములోని యారణ్యపర్వమున రామాయణకథ కలదు. అందలి గాధలకును దృశ్యమాన వాల్మీకి రామాయణములోని గాథలకును గొన్నియెడల భేదములున్నవి. భారతమున రావణుడును విభీషణుడును భిన్నోదరులు కుంభకర్ణుని లక్ష్మణస్వామి వధించి యున్నాడు కాని "భారత తాత్పర్య నిర్ణయము" అను మహాభారత వ్యాఖ్యలో శ్రీ మధ్వాచార్యులవారు కుంభకర్ణునకు అతికాయుడు అను నర్థము పొసగునట్లు విమర్శనమును చేసియున్నారు. భారతములో రామాయణకథయం దుత్తరకాండ గాధలు లేనందున నది ప్రాచీనమనియు రెండవసారి వృద్ధికాబడిన వాల్మీకి రామాయణములోని రామకథ భారతాంతర్గత రామకథకు పెంపకము చేయబడినదని తలంచుచున్నాను.

తొలుత అనుష్టుప్ఛందస్సుగా వాల్మీకిచే నిర్మింపఁబడిన రామాయణకథయే నించుమించుగ భారతారణ్య పర్వమున నేడువందల యిరువది మూఁడు (723) అనుష్టుప్పులతో జెప్పబడి యున్నది. ఇవి వాల్మీకి విరచితగేయానుష్టుప్పులు గాకుండినను తదనుకరణములుగా నుండవచ్చును.