పుట:రామాయణ విశేషములు.pdf/18

ఈ పుట ఆమోదించబడ్డది

xvi


శ్రీ రెడ్డిగారు రాముని కాలముఁ గూర్చియు, వాల్మీకి కాలముఁ గూర్చియుఁ జాల చర్చించియున్నారు. శ్రీరాముఁడు ఋగ్వేదావిర్భావమునకుఁ బూర్వుడనుట నిశ్చయమె. వాల్మీకి విరచితమని చెప్పబడు దృశ్యమాన శ్రీమద్రామాయణమంతయుఁ బ్రాచీనుఁడగు వాల్మీకిచే రచియింపఁబడలేదు. ప్రాచీన వాల్మీకి రామాయణము భిన్న వృత్తములు కలదిగాఁ గాక వేదోదితమగు “అనుష్టుప్” ఛందస్సులోఁ గొంచెము మార్పునొందిన యనుష్టు బ్రూపయుక్త గ్రంథమని లౌకిక ఛందోరూపమగు "మానిషాద” అను శ్లోకమే యుదాహరణముగాఁ గల్గియున్నది. 'మానిషాద' అను శ్లోకము అనుష్టువ్ ఛందోజనితము . వైదిక వాఙ్మయమునం దనుష్టుప్ఛందస్సు కలదు. అది ప్రతిపాదమునకు నెన్మిదేసి యక్షరములుగల నాల్గుపాదములు గలది. గురులఘు నియమము లేదు. కాని యా అనుష్టుప్పును వాల్మీకి లౌకిక వాఙ్మయమునకుఁ దెచ్చుటలోఁ గొంత మార్పును గల్గించియున్నాఁడు. ఆదేదనగా - లౌకికానుష్టుప్పునఁ బ్రథమ తృతీయ పాదములలోని పంచమాక్షరములును ద్వితీయ చతుర్థ పాదములలోని సప్తమాక్షరములును నియమ యుక్తములగుటచేఁ బాడు నపుడు లయకు సరిపడును. ఇదియే వాల్మీకి మహర్షి లౌకికమునకు దెచ్చి రచించి పాడించిన రామకథ. యజ్ఞములయందు కర్మములనడుమఁ గల విశ్రాంతి సమయమున సదస్యశాలలో యజమానుఁడు, ఋత్విజులు, పెద్దలు కూడినపుడిట్టి గాథలఁ బాడించుట కల్గును. రాముఁడశ్వమేధముఁ జేయునపుడు వాల్మీకి రామాయణమును 'కుశలవ' సంజ్ఞలుగల యిరువురు శిషులగు 'కుశలవు' లచే బాడించెను. ప్రాచేతస (వాల్మీకి) ద్రష్టములగు కొన్ని సామములు సామవేదమునఁ గాన్పించుచున్నవి. అవి యశ్వమేధమున నేసమయమున హోతచే గానము చేయఁబడునో పరిశీలింపవలసి యున్నది. వాల్మీకి తొలుత రచించి పాడించిన రామకథ అనుష్టుప్పులచేఁ గూర్పఁబడి నేటి రంగనాథ రామాయణములోని ద్విపద గాధవలె నుండును. దానిని 4 - 5 దినాలలో వీణలమీద కుశలవులు పాడియుందురు. ఆందు భిన్నభిన్న వృత్తములుండవు. భిన్నభిన్న వృత్తములు గల వాఙ్మయముతోఁగూడిన రామకథ పిమ్మట చేర్పఁబడినదేయని తలతును.