పుట:రామాయణ విశేషములు.pdf/15

ఈ పుట ఆమోదించబడ్డది

xiii

పేరుతో రెండేడులనుండి “విభూతి” లో ప్రకటింప బడుచుంట పాఠకులకు సువిదితము. లోకమున భిన్నరుచు లుండుటయు క్రొత్త గాదు. ఈ వ్యాసము నవలోకించువారిలో కొందరు 'విభూతి' సంపాదకుల మందలించిరి. మరికొందరు శైవ పక్షపాతము వలన రామాయణమున కపకీర్తి కలిగింపబడుచున్నదనిరి. సమర్థమైన పరిశ్రమతో నిది వ్రాయబడినదనియును, త్వరగా పూర్తి గావింపుడనియును పొగడిన విజ్ఞులును లేకపోలేదు.

ఈ వ్యాసమును ప్రచురించుటలో నిందాస్తుతులతో నా కెట్టి ప్రసక్తియును లేదు. విమర్శన వ్యాసముల పట్ల సాజముగ నాకుండెడు ప్రీతిని బట్టియే ఇది 'విభూతి'లో వెలిగినది. శ్రీ ప్రతాపరెడ్డిగారు వైష్ణవ మతీయులే కావున 'విభూతి' వారి శైవత్వమువలన రామాయణమునకు రవ్వ గలిగించు నుద్దేశ్య మింతకంటెను కాదనుటను తెల్ప నవసరము లేదు. ఇందు భ్రమప్రమాదములు లేవని లేఖకులు ప్రతిన బూనలేదు. దీనిపై అర్హములైన ప్రతివిమర్శనా వ్యాసముల 'విభూతి'లో ప్రచురించుటకు సంపాదకులు సన్నద్ధులయియే యున్నారు.

దీనిని రచించుటలో శ్రీ రెడ్డిగారు మిక్కిలి పరిశ్రమించిరనియును పెక్కు గ్రంథముల నవలోకించిరనియును ఎట్టివారైనను జెప్పవచ్చును. ఆంధ్రమున నింత విపులముగ వ్రాయబడిన రామాయణ విషయక వ్యాసము వేరొకటి కనుపడలేదు. దీనిని సరిగా నుపయోగించుకొని మరియొక యుద్గ్రంథమును విజ్ఞులు సిద్ధపరచవచ్చును. ఈ దృష్టితో శ్రీ రెడ్డిగారి ఈ చిన్ని పొత్తమునకును విలువ యుండకలదు. ఓర్పుతో నీ వ్యాసమును “విభూతి” కందించినందులకు శ్రీ రెడ్డిగారికి ధన్యవాదములు.

ఈ వ్యాసమున ననేక స్థలములలో శ్రీ రెడ్డిగారు తమ నిశితమైన బుద్ధిఫాటవమును జూపియేయున్నారు. కాని ఏకవేణీశబ్దార్థము, హను