పుట:రామాయణ విశేషములు.pdf/12

ఈ పుట ఆమోదించబడ్డది

x

ముందు చర్చింప బడును' అను మాటలు) ఈ ముద్రణమున కనుకూలించునట్లు నేనే తొలిగించితిని. నాలుగవ, ఐదవ ఫారము లక్కరకు వచ్చినవి. ప్రథమ ముద్రణ ప్రతిలో రెండవ ప్రకరణము బౌద్ధజాతక రామకథా విశేషముల చర్చతో (20 పుట) ముగిసినది. ఇది లభించిన ఫారములందు 38 వ పుటకును ఈ గ్రంథమున 42 వ పుటకును వర్తించును. ఈ గ్రంథమున 43 నుండి 45 పుటల వరకు గల విషయమంతయు లభించిన ఐదవ ఫారమందలి చివర రెండు (39-40) పుటలందు గలదు. ఇది ప్రథమ ముద్రణ ప్రతిలో లేదు. ఇది యంతయు రెండవ ప్రకరణమున రెడ్డిగారిచే క్రొత్తగా చేర్చబడినట్టిదే. ఈ గ్రంథమున 45 పుట......ఇట్టి గుర్తులతో విడిచి పెట్టితిని. లభించిన ఐదవ ఫారము చివర పుట (40) 'ఋషులు సంతృప్తులై రాముని శపింప' అను అర్ధ వాక్యముతో ముగిసినది. ఆరవ ఫారము లభించలేదు. కనుక నీ రెండవ ప్రకరణ మేరీతిగా ముగిసినదో తెలియదు. ఇంతేకాదు-మూడవ ప్రకరణ మంతయు లభించలేదు. అందు రెడ్డిగా రే యే విషయములు మరల చేర్చిరో తెలియదు. కనుక మూడవ ప్రకరణమున నధిక భాగము ప్రథమ ముద్రణ ప్రతి నుండి గ్రహించితిని. ద్వితీయ ముద్రణమునకై వారు సిద్ధపరచిన ప్రతి 32 వ పుటనుండి లభించినదని మొదట మనవి చేసితిని. ఆ 32 వ పుటలో సగము భాగము వారు కొట్టివైచుటచే నదియు నీ గ్రంథమున చేర్చబడలేదు. తక్కిన సగము భాగమున ప్రక్షిప్తములను శీర్షికతో నారంభమగు దానిని వారు నాల్గవ ప్రకరణముగా వ్రాసియుంచిరి. అందుచే ప్రక్షిప్తముల నుండి నేను నాల్గవ ప్రకరణ మారంభించితిని. (పుట 69). ఇచ్చటినుండి గ్రంథమంతయు సమగ్రముగా శ్రీ ప్రతాపరెడ్డిగారి హృదయ మాశించునటులే ముద్రింప గలిగితిమి. హైదరాబాదు నగరమందు రెడ్డిగారి యింటను, వారి స్వగ్రామమునను వారు ముద్రింపించిన ఫారములకై వెదకితిమి కాని లాభములేదయ్యెను. లభించని వానిలో నేయే విషయము లధికముగా చేర్చిరో తెలియరాదు. ఇది గ్రంథమును గూర్చిన కథ.