పుట:రామాయణ విశేషములు.pdf/104

ఈ పుటను అచ్చుదిద్దలేదు

54 రామాయణ విశేషములు

గానము చేయ మొదలిడిరి. అర్జునుడు పాతాళఖండమను పేరుపొందిన దక్షిణ అమెరికాకు వెళ్ళి అచ్చట ఉలూపియను నామెను పెండ్లియాడెనని చెప్పుదురు. దక్షిణ అమెరికాలోని పెరూ, మెక్సికో అను మండలాలలోని జనులు హిందువులను పోలియున్నారనియు వారి ఆచారములు హిందువుల వంటివే యనియు వారి దేవతలలో బహుపురాతన కాలమందే గణేశుడు, ఇంద్రుడు ముఖ్యులైన దేవతలై యుండిరనియు, అచ్చటి ప్రాచీనస్థల ఖననములనుండి గణేశుని విగ్రహాలు లభించినవనియు మెక్సికో పరిశోధక పండితులే వ్రాసియున్నారు. దక్షిణ అమెరికాలోని పెరూమండలము లోని రాజులు తాము ఇనకులమువారమని చెప్పుకొనిరి. వారి భాషలో ఇనకులమును ఇనకా అని పేర్కొనిరి. వారి పండుగ లన్నిటిలో గొప్ప పండుగ “రామసీత్వా" ఉత్సవము అనగా రామసీత అను దేవతల పూజ. ప్రాచీనకాలములో హిందువులు సముద్రప్రయాణముచేసి అమెరికావరకు పోయివచ్చియుండిరనియు చెప్పుకొనియుండిరి. ఈ కారణాలచేత రామాయణ మెంతటి ప్రాచీనమైన ఇతిహాసమో విశదము కాగలదు.[1]

వాల్మీకి కాలము

వాల్మీకి రామునికి సమకాలికుడు అగునో కాదో ఉత్తరకాండలోని కథయే మన కాధారమగుచున్నది. అతని ఆశ్రమములో కుశలవులు జన్మించిరనియు వారు బాలురుగా పెరిగిన తర్వాత వాల్మీకి రచిత రామ కథను సుందరముగా గానము చేసిరనియు రామాయణ బాలకాండములో

నిట్లు వర్ణించినారు.


  1. వివరములకుగాను చూడుడు- హరవిలాస శారదాగారి Hindu Superiority పుటలు 150 - 1 54, మరియు "హిందూ ఆమెరికా” అను ఆంగ్ల గ్రంథమును చమన్ లాల్ అనువారు వ్రాసినారు. అందు రామ సీత్వాను గురించి 111 పుటలో వ్రాసినారు.