పుట:రామాయణ విశేషములు.pdf/10

ఈ పుట ఆమోదించబడ్డది

viii

శాస్త్రిగారును వ్రాసినదానికన్న నధికముగా వ్రాయవలసినది లేదు. ఇక గ్రంథము గూర్చి మాత్రము రెండు మాటలు మనవి చేతును.

రామాయణ విశేషములను నీ వ్యాసములను శ్రీ ప్రతాపరెడ్డిగారు తొలుత 'విభూతి' పత్రికలో ప్రకటించిరి. అప్పుడే రెండు వందల ప్రతులా భాగమునకు సంబంధించినవి ఎక్కువగా తీసి ముఖ పత్రము, మున్నగు వానితో రామాయణ విశేషములను గ్రంథముగా ప్రకటించిరి. తీసినవి 200 ప్రతులే కనుక నవి యాంధ్రదేశ మంతటను వ్యాపించలేదు. ఆరు సంవత్సరముల క్రిందట నేను యక్షగానముల గూర్చి పరిశోధన మొనర్చుచు యక్ష శబ్దచర్చ ఉస్మానియా విశ్వవిద్యాలయ గ్రంథ భాండాగారమందలి రామాయణ విశేషములందు చూచి సందేహము తీరక రెడ్డిగారి దగ్గరకు పోయితిని. వారు తమ చేతనున్న రామాయణ విశేషముల ప్రతిని నా ముందుంచిరి. ఈ ప్రతిలో వారెన్నియో క్రొత్తవిషయములను తెల్ల కాగితములపై వ్రాసి మధ్య మధ్యన నతికించిరి. పూర్వాభిప్రాయములు మారినచోట కొట్టివేసిరి. దీనిని మరల ముద్రించరాదాయని నేనంటిని. ఈ ప్రయత్నమంతయు నిందులకే యని వారు మారుచెప్పిరి. శ్రీ ప్రతాపరెడ్డిగారు 'ప్రజావాణి'కి సంపాదకులైన పిమ్మట మార్పులు కూర్పులతో కూడిన రామాయణ విశేషముల ముద్రణ మారంభించిరి. ఆరు ఫారములు ముద్రింపబడినవి. ఇంతలో 'ప్రజావాణి' యాగిపోయినది. ప్రతాపరెడ్డిగారి మనము బాధపడినది. రామాయణ విశేషములు సశేషముగా నుండి పోయినది. రెడ్డిగారు కీర్తిశేషులయిన పిమ్మట వారి స్థిరచరాస్తులు వారి కుమారులకును, వారి గ్రంథములు (ముద్రితా ముద్రితములు) శిష్యుడనైన నాకును దక్కినవి. రామాయణ విశేషములను ముద్రింపించిన బాగుండునని నేను తెలంగాణా రచయితల సంఘము వారిని కోరితిని. వారు నామాటను మన్నించిరి. మిత్రులు శ్రీ ఉరుపుటూరి రాఘవాచార్యులుగారు, శ్రీ బి. దామోదర రెడ్డి (తిరుమలాపురం), శ్రీ ఎస్. ఎన్. రెడ్డి (శ్రీ ప్రతాపరెడ్డిగారి జ్యేష్ఠ పుత్రులు) గారల సహాయమున ముద్రణమునకు కావలసిన ధనమును సేకరించిరి.