పుట:రాధికాసాంత్వనము (ముద్దుపళని).pdf/67

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

50 రాధికాసాంత్వనము

చను నే నెలరేఖలు నా
ననుపమములు తత్సమంబు లవియే జగతిన్. 35

చ. ఖరమురకంసహంససరకాదిసురారుల ప్రాణవాయువుల్
పొరిగొని దివ్యరత్నమయముద్రిక లొప్పెడిసోగవ్రేళ్లతో
హరిభుజకాండముల్ చెలువ మందు శిరోమణు లంద మందఁగా
మురు వగుపంచభోగయుతభోగుల నీఁగను శ్రీ లొసంగుచున్. 36

చ. శర ణనువారికి న్మృదువు శత్రులకు న్గఠినత్వ మిచ్చుఁ ద
మ్మెఱుఁగని వీనిపల్లవము లే మెన యంచుఁ దలంచె నంచుఁగా
మురు పగుదేవశాఖిని సమూలముగాఁ బెకలించి తెచ్చి యా
మురరిపు కేలుదోయి యిడె ము న్నొకభామ పెరంటిచెట్టుగన్. 37

ఉ. కోరినఁ గల్పశాఖి యొకకొన్నిఫలంబుల నిచ్చు నల్పముల్
గోరిక పార నిత్యఫలకోటుల నిచ్చు మురారి బాహువుల్
సారెకు వాని వీని కెటు సాటి యనం దగు దీటు లేమిచే
వారక పోల్తు రీకవులు వానికి వీనికిఁ దాఱుమాఱుగన్. 38

చ. అరయఁగ శంఖచక్రముల నంది సుగంధములం భరించి ప
ల్మరు విను చిక్కినట్టిమహిమన్ ఘనసింధురసేవ్యమానమై
ధరణిధరత్వ మంది గిరి తద్బుజయుగ్మముమీఁద నెంతయున్
సరిపడఁ బోరి యెత్తు వడె చాలక యా మురవైరిచేతనే. 39

చ. సరసులు మెచ్చఁగాఁ దనరు శంఖ మనంతము పద్మయుగ్మమున్
నరహరికంఠమధ్యనయనంబులకు న్వెలగా వటన్నచో
నరయఁగఁ బోకలా పిడికిలా యొకచేర లటంచు నెంచఁగన్
హరిహరి వారిమూఢమతి కాదియు నంతము గల్గ నేర్చునే. 40

తే. మారు డధరామృతం బెందు జాఱనీక
కోరి పెట్టిననీలంపుకోర యనఁగ
గొల్లచెలియలసొమ్ముగాఁ గొనుచుఁ దనరు
మదనజనకుని చుబుకంబు మధుర మొదవు. 41