పుట:రాధామాధవసంవాదము (వెలిదిండ్ల వేంకటపతి).pdf/26

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ద్వితీయాశ్వాసము

25


క.

నందయశోదలు పరమానందంబున నున్నవారె?, నన్ దలఁచెదరే
యందలిమనవారందఱు?, గొందఱు నన్నెపుడు దూఱుకొందురె కినుకన్?

91


ఆ.

పిన్ననాఁటనుండి నిన్నుఁ బ్రాణంబుగాఁ, బెంచుకొన్నరాధ యించుకంత
తడవు వీడఁజాల దెడఁబాసి వచ్చుటఁ, జింతసేయ నేదొ వింతే కలదు.

92


క.

అని వనజాయతలోచనుఁ, డన విని యింతంత గాని యానందముతో
నెన రింత లేకయుండినఁ, జన నగునే యనుచు మదిని సంభ్రమ మొప్పన్.

93


ఉ.

ఓసుగుణాభిరామ పురుషోత్తమ దేవరవారు పూర్ణసిం
హాసనపట్టభద్రబిరుదాంకమహోన్నతులై భవత్పద
వ్యాసలసత్కిరీటవసుధాధిపకన్యక లూడిగంబు లా
సాసలఁ జేయనుంటఁ గనినంతకు వింత మ ఱేమీ కల్గెడిన్.

94


ఉ.

అన్నియు నుద్ధరించెదనటంచు నటించినదాని కేమిపో
యె న్నెల కొక్కసారి మొగ మించుక చూపినఁ జాలు నేల యీ
యెన్నిక లంచుఁ గొందఱు నిజేచ్ఛల దూఱుటదక్క నెవ్వరున్
ని న్నొకపాటివాఁడని గణించెదరే యదువంశభూషణా.

95


వ.

అని పలికిన.

96


క.

ఇమ్మాటలు మఱి మఱి విన, ముమ్మరమై తనదుచెవికి ములుకులు గాగా
ముమ్మడి నలుమడి కోపము నెమ్మదిలో బొడమ రుక్మిణీమణి యంతన్.

97


ఉ.

జాఱినకొప్పుతో జెవికి జాఱినపాపటబొట్టుతో దిగం
జాఱినపైటతో నొఱగజాఱిననీవికతో నొకింతగా
జాఱినసొమ్ముతో జెమట జాఱినకస్తురిబొట్టుతో ముడిం
జాఱినపూలతో నొడలు జగ్గుమనన్ వడి లేచి దిగ్గునన్.

98


గీ.

లేచి తనబోంట్లమీదను లేనికోప, ముంచి గుప్పించి పిలిచి గద్దించుకొనుచు
సైగగా బోవ దన కది సైగ గాగ, శౌరి ముసిముసినగవుతో నూరకుండె.

99


గీ.

చిలుకకడ జూచి నీ కేల చిన్నవోవ?, నెంత లేదిది; నీకు బ నేమి; యొకరి
ప్రకృతి గాదని మాన్పంగ కొకరివశమె?, చెలియ యేమనె నవ్వల దెలుపు మనిన.

100


చ.

చెలియ కి కేమియున్నవి విశేషము లయ్యెడ నెన్న మాటికిన్
దెలుపగ వేసటయ్యె జెలిదీనత జూచిన గృష్ణ కృష్ణ; యా
పొలతుక యేమిభాగ్యములు పొందెడినో తెలియంగరాదు; వే
డ్కల గనియైన నీదుసముఖంబున దెల్పగరాదు తద్వ్యథల్.

101