పుట:రాధామాధవసంవాదము (వెలిదిండ్ల వేంకటపతి).pdf/25

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

24

రాధామాధవసంవాదము


క.

పొ మ్మనవలె; న న్నీయెడఁ, బొమ్మనవలె; నీవు పోయి పురుషోత్తముతో
ర మ్మనవలె; దేహము నీ, సొ మ్మనవలె; విడువవలదు సు మ్మనవలయున్.

81


మ.

తను భోగింతుఁ, దను న్వరింతు ననుచింతం గాదు పో యింక నా
పని నాకేటికి; సిగ్గులేదె తొలుతన్ బ్రాయిండి యిల్లాలిఁ గా
పునుగాఁ జేసి తుదిన్ ద్యజించి తిరిగే పుణ్యాత్ములం జూచినం
తనె చాలున్ ఫల; మీశ్వరేచ్ఛ యెటులైనం గాని యామీదటన్.

82


మ.

తన పేరుం దనపల్కులుం దనవగల్ తా నాయెడం జేయుమ
న్ననయు న్నెమ్మది నాఁటియున్న దిఁక మానంచాలఁ జింతాభరం
బున డెందంబున కొక్కటన్ విరసమున్ బుట్టించి పోఁ గాని ర
మ్మనవే యొల్లనివాని కేల యితనివ్యాపారచాతుర్యముల్.

83


ఉ.

ఇంగిత మెల్లనుం దెలియ నెంతయు జాణవు నీవు; నీవచ
స్సంగతి యేరికిం గలదె; సన్నుతి గా దిది శౌరి నేను ను
ప్పొంగుచుఁ గూడినప్పటికి బొల్పుగఁ దోఁచును నిన్ను మెచ్చఁగా
బంగరుచిల్క; నిన్నిపుడు పల్కఁగ నేర్తునె పేదపల్కులన్.

84


గీ.

అనుచుఁ దనచేతివ్రాలఁ బద్యములు రెండు, వడిగ లిఖియించి ఱెక్కలనడుమ నునిచి
చిల్క నేనేమి దెల్ప నీచిత్త మిఁకను, దనదుభాగ్యము పోయిరమ్మనుచు ననుప.

85


క.

గగనమున కెగసి మథురా, నగరముఁ గని యచటఁ గమలనాభుఁడు లేమిన్
దగఁ దెలిసి ద్వారకాపురి, డిగి యచ్చటినగరు సొచ్చి డెందం బలరన్.

86


క.

తమకమున భోజకన్యయుఁ, గమలాక్షుఁడుఁ బడుకటింటఁ గవగొని యుండన్
సమయము గాదని యచ్చట, నమరినచిలుకలను గూడి యాడుచు నుండెన్.

87


వ.

అంత.

88


మ.

తళుకుదంతపుఁజెక్కడంపుఁబనినిద్దాజాళువాకీలుబొ.
మ్మలు నల్వంకల మాడిగంపునడగుమ్మల్ గాఁ 'బనుల్ సేయఁగాఁ
గులుకుంబచ్చలకోళ్లమంచముపయిన్ గోపాలుఁ డారుక్మిణీ
లలనారత్నముతోడిఁ గూడి పొలయల్కన్ మార్మొగం బౌనెడన్.

89


మ.

చిలుకం జూచి బిరాన లేచి నగుచున్ జేసాచి రా రమ్ము ము
ద్దులగారాబుమిటారిచిల్క యన నెంతో వేగఁ బాదాంబుజం
బులపై వ్రాలఁగ గేలిపైఁ దిగిచి యింపుల్ గుల్క ముద్దిచ్చి ఱె
క్కలఁ జక్కంబడదువ్వుచు న్నిజదృఢాంకంబందు లాలించుచున్.

90