పుట:రాధామాధవసంవాదము (వెలిదిండ్ల వేంకటపతి).pdf/21

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

20

రాధామాధవసంవాదము


నొకటి సేయఁగబోయి యొకప్రయత్నము చేయు, మంచిదాన నటంచు మదిఁ దలంచు
నొకటి పల్కఁబోయి యొకటి యేమేఁ బల్కు, మోసమాయె నటంచు మోమువంచు


గీ.

మారు నిందించునదె తోఁచె శౌరియంచు, బయలు గబళించుఁ బలవించుఁ బల్కరించు
నిజము గాదంచుఁ గన్నుల నీరు నించుఁ, గలకలనుముందుఁ గలయించుఁ గలువరించు.

45


గీ.

బయలు వెడలంగఁజాలదు భయముచేత, నిముడుకొనియుండఁజాలదు భ్రమముచేతఁ
గలికి యపు డోదమున బడ్డకరిణికరిణిఁ, దొట్రుపడి కొట్టుకాడును ద్రొక్కులాడు.

46


సీ.

మధుకైటభారాతి మధురవాచారీతి, నొంటిగాఁ జింతించు నొక్కవేళ
హాటకాంబకధారి యదెవచ్చె నని చేరి, యున్నట్ల బయలాను నొక్కవేళ
పాధోధిశాయిపైఁ బదము పాడగబోయి, యూర కేదొ గొణఁగు నొక్కవేళ
మనమునఁ బెనఁగొన్న మర్మకర్మములకు, నుడుకుచు వెతనొందు నొక్కవేళ


గీ.

దిక్కులేదని విధి దూఱు నొక్కవేళ, మ్రొక్కి దయఁజూడుమని వేఁడు నొక్కవేళ
నోయదూద్వహ యని చీరు నొక్కవేళఁ, దా మది కలంగి రాధికాకోమలాంగి.

47


గీ.

మఱియు నొకయింత శయ్యపై మఱవులేక, బాధ పడి రాధ తడఁబడి బడలి నిల్చి
పిల్చి హాయనతాఁ బ్రలాపింపఁదొడఁగెఁ, గృష్ణు వటు గూర్చి చెక్కునఁ గేలు చేర్చి.

48


క.

హా కృష్ణ! హా యదూద్వహ!, హా కేశవ హా ముకుంద! హా గోవిందా!
హా కమలనయన! హా హరి!, హా కమలాహృదయలోల! హా గోపాలా!

49


మ.

నిను నాదైవముగా మదిం దలఁతు నీనిద్దంపునెమ్మేను నీ
గొనబుంజెక్కులు నీసుధాధరము నీగోమైన నెమ్మోమునుం
గని యుప్పొంగుచు నాతపఃఫలముగాఁ గైకొందు నేఁ డయ్యయో
నను నేలా గెడఁ బాయఁజాలితివి కృష్ణా ! యెంత నిర్మోహివో.

50


మ.

ఒకనాఁ డించుక చూడకున్న నిను నాఁ డూరెల్ల నేమేమొ కం
టికి నిస్సారము గాఁగఁ గానఁబడు; నా డెందంబు నిన్ జూచినం
దుకె ముల్లోకముఁ దానె యేలుగతి నెందున్ సంతసంబందు; నేఁ
డకటా యేమియు లేక నీవు ననుఁ గృష్ణా! యింత గాఁ జేయుదే.

51


ఉ.

అక్కట యెన్నిముచ్చటల కాసపడుంటి మనంబులోనఁ దా
నొక్కటి యెంచ దైవ మదియెక్కటి యెంచుట సత్యమాయె; నీ
యక్కునఁ జెక్కుఁ జేర్చుకొననైతిని, నా కిది మోసమాయె న
న్నిక్కము పాయకుందువని ని న్నెద నమ్మితిరా మనోహరా.

52