పుట:రాధామాధవసంవాదము (వెలిదిండ్ల వేంకటపతి).pdf/19

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

18

రాధామాధవసంవాదము


క.

వచియించను రచియించను, బవరించ గణించఁ బంచబాణునితరమా
కచమేచకచకచకరుచి, కుచలికుచమరీచిలికుచమకుచకే తగుటన్.

25


ఆ.

క్రోల బుద్ధిగొల్పు కొమ్మవాతెరతోడఁ, బండియున్న దొండపండు సరియె?
చేరెఁడేసికన్ను లారసి యిసుమంత, తమ్మిరేకు లనఁగ ధర్మ మగునె.

26


క.

కోమలిమోమున కాహిమ, ధాముఁడు సరిగాడటన్నఁ దామర సమమా
తామర సమమొనప్పుడు, తామరసము గాక తనయథాస్థితి నున్నన్.

27


క.

ఏయెడ నఖశిఖవర్ణన, సేయంగా నొకరివశమె ; శేషుఁడు రాధన్
బాయక వేణినెపంబై, వేయేటికిఁ దెలియ లేక వ్రేలుచునుండున్.

28


క.

ఆనగుమో మాకనుఁగవ, యానడు మామోవితీరు నాచనుఁగవని
క్కానడగు ల్కాతొడత, ళ్కానీటును మఱవవచ్చునా చెలికాఁడా.

29


సీ.

అల్లుఁడా రమ్మని యలరించు నొకవేళ, హొయలుగాఁ గైసేయు నొక్కవేళ
దుడుకు చేసినను బుద్ధులు దెల్పు నొకవేళ, మక్కువ ముద్దిచ్చు నొక్కవేళ
కన్నెలతో నాడ గద్దించు నొకవేళ, నొంటిగాఁ జదివించు నొక్కవేళ
తచ్చనమాటలఁ దర్కించు నొకవేళ, నూరక నవ్వించు నొక్కవేళ


గీ.

వలచు నొకవేళ నొకవేళ వద్దఁ జేరుఁ, బలుకు నొకవేళ నొకవేళఁ బల్కకుండుఁ
బెనఁగు నొకవేళ నొకవేళఁ బ్రేమఁ గలియు, నలుగు నొకవేళ నొకవేళ నాదరించు.

30


క.

ఆనాతిమనసుమర్మము, లే నెఱుఁగుదు నాదుమర్మ మెఱుఁగును రాధా
మానవతి లోకు లెవ్వరుఁ, గానరు మామనసుమర్మకర్మము లరయన్.

31


చ.

తననునుగోటితాఁకులకుఁ దాళిన నెవ్వతెపైఁ బరాకు నీ
కని యొకకిన్కఁ దెచ్చుకొని యవ్వలిమోమయి మోడిసేయుఁ గా
దని విదళించినన్ సయిప దాయనె నేఁడని చిన్నవోవు యెం
తని వచియింతుఁ గంచుపద నాచెలినెమ్మన మెంచ నుద్ధవా.

32


చ.

సికనునుగోళ్ల దువ్వుచును జెక్కిలి నొక్కుచు నేమియే నొకా
నొకథ బూతుగాఁ దెలుప నూకొన కేను బరాకుగాఁ, బకా
పక నగి యేలరా వినవు పాపఁడ! యింతనె యింతవింతయే
రక మనుముచ్చటల్ మఱపురా విఁక రాధిక నెట్లు వాయుదున్.

33


శా.

రారా కృష్ణుఁడ రాఁగదోయి వరదా, రావయ్య గోపాలకా,
యేరా చుంబన మీఁగదోయిఁ యధరం బీవయ్య నీయాగడం
బేరా, కోప మదేలనోయిఁ యలిగే వేమయ్య, మాటాకరా,
"రారా ర" మ్మని పిల్చు, నెట్లు మఱతున్ రాధావధూటీమణిన్.

34