పుట:రాధామాధవసంవాదము (వెలిదిండ్ల వేంకటపతి).pdf/16

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శ్రీరస్తు

రాధామాధవసంవాదము

ద్వితీయాశ్వాసము

క.

శ్రీమత్సమస్తసద్గుణ, ఛామా! రామాభిరామా! తాండవకృష్ణ
స్వామిపదాంబుజదాసా! శ్రీమగదలరామదాస! చిత్రవిలాసా!

1


గీ.

అవధరింపుము జనకధరాధిపతికి, మదిని సంతోష మొదవ సన్మౌనితిలకుఁ
డైనశుకయోగి రోమాంచితాంగుఁ డగుచు, నవలికథయెల్ల నిట్లని యానతిచ్చె.

2


చ.

అమరఁగఁ గార్యఖడ్గములయందుఁ బరాకయి రాధికామనో
రమణుఁడు కొన్నినాళ్ళు మధురాపురిలో విహరించి యంత భ
ద్రముగ సముద్రమధ్యమున ద్వారకయన్ పురమున్ ఘటించి రా
జ్యమునకు నాథుఁడై సకలసంపద లందుచు నొప్పె నప్పురిన్.

3


కుల మెల్లను రక్షించెసు, దలిదండ్రుల చెఱలు వాపి తాఁ బోషించెన్
భళి! యిఁకఁ దగదె "సుపుత్రః, కులదీపక" యనెడుమాట గోవిందునకున్.

4


ఉ.

ఏవగవారు చేరిన సహించి తనంతటివారి జేయుచున్
దైవము దాత తల్లియును దండ్రియుఁ దానయి ప్రోవఁగా జగ
త్పావనమూర్తి తవకుఁ బావనమాతను గన్నదేవకీ
దేవినిఁ దన్నుఁగన్న వసుదేవుని నాపదఁ బాపి పోచుటల్.

5


మ.

పదిరెండేండ్లగు ప్రాయమందు నిటు గోపాలుండు భూపాలురన్
మెదలన్ మీఱఁగనీక లోఁగొనుచు రుక్మిణ్యాదులన్ గన్యలన్
బదియార్వేల వివాహమై సగుణరూపబ్రహ్మమై కన్నవి
న్నదిగా దీమహిమం బటంచు ఘను లెన్నంగాఁ జెలంగెన్ మహిన్.

6


క.

ఈవగ సమస్తభాగ్యము, కైవసమై నిండియుండఁగా సైఁపక యా
గోవిందుడుఁ రాధపయిన్, భావంబడి కందుఁ గుందు బరవశ మొందున్.

7


క.

డాయఁడు వనితామణులన్, మూయం డొకగడియమాత్రమును గనుఱెప్పల్
చేయడు చక్కఁగ భోజన, మీయఁడు తనమనసుమర్మ మెవ్వారలకున్.

8