పుట:రాజశేఖరచరిత్రము (మాదయగారి మల్లన్న).pdf/28

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

24

రాజశేఖరచరిత్రము


గీ.

పేదసాముల విన్నపం బాదరించి
వ్రతులమైనట్టి మముబోటివారి నరసి
రాజ్యమేలినఁ దగుఁగాక ప్రాజ్యవైభ
వంబు గలదని సుఖయించువాఁడు నృపుఁడె.

20


సీ.

నెమ్మేని తిమిరంబు నేత్రగోళంబుల
                       పర కర్ణపుటముల ప్రత్తినోరి
వాకట్టుమందు గర్వలతాలవాలంబు
                       వినయకృత్యంబుల వేరువిత్తు
కరుణారసంబు తెక్కలికాఁడు మదిచొక్కు
                       పాతకంబులపాలి పట్టుగొమ్మ
మొగమోట కుడుగని పగరాజసంబుల
                       యిక్కువ గురుసేవ కెదురుచుక్క


గీ.

పరుషవర్తన కునికి లోభంబు టెంకి
బాంధవస్నేహసిందూరపాలకంబు
కలశపాధోధిపుత్త్రి క్రేఁగంటిచూడ్కి
వాని రాజుల నేరమె కాదు సువ్వె.

21


క.

అన విని శివ శివ యని య
జ్జనపతి వెఱఁగంది యపుడు సవినయముగ న
మ్మునివరు విహితాసనమున
నునిచి భయం బొదవఁగా మృదూక్తులఁ బలికెన్.

22


క.

వెఱ పొక యింతయు లే కీ
తెఱఁగున మిము నెవ్వఁ డింత తెగి చేసెనొకో
యెఱిఁగెఱిఁగి యుండి యకటా
కొఱవిం దలఁగోఁకుకొనుటకుం దలపెట్టెన్.

23


గీ.

వికటదైత్యులు నాపేరు విన్నయంత
జలదరించుచు వలయాద్రిచఱులఁ గాని
యెందుఁ దలచూప వెఱతు రిం కేమి చెప్ప
నింతకాలంబునకు నొక వింత గంటి.

24