పుట:రాజశేఖరచరిత్రము (మాదయగారి మల్లన్న).pdf/22

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

18

రాజశేఖరచరిత్రము


గీ.

ననఁగ నొకకొత్తచెల్వ మయ్యంబుజాత
గంధి కెంతేని గల్గె నక్కనకశైల
కార్ముకానూనకరుణావికాసలబ్ధ
ఫలరసామృతధార లల్పంబె తలఁప.

84


క.

ఈరీతి నమ్మృగేక్షణ
యారూఢమనోనురాగ యై యుండు తఱిన్
మేరుమహీధరకార్ముక
కారుణ్యము కతనఁ గొన్నిఘస్రంబులకున్.

85


సీ.

కౌను దొడ్డతనంబుఁ గని చింతపడుగతిఁ
                       గుచముఖంబులు నీలరుచి వహించె
మందస్మితంబున మరగి రాదన ముద్దు
                       బలుచనిచెక్కులు పలకఁబాఱె
ఫలరసంబుల కెవ్వి ప్రతిరామి నొల్లదో
                       యన జిహ్వ కన్నిట నరుచి పుట్టె
గర్భస్తుఁడగు బాలు కమనీయగుణభార
                       మహిమ నా నడ లతిమంద మయ్యె


గీ.

గలికి బేడిసమీలతోఁ గలహమాడు
వాలుఁజూపుల దాటులు డీలుపడియె
మంటి కమ్మనితాలిపై మనసు పాఱె
నాఁడు నాటికి బాలి కానలినముఖికి.

86


వ.

అట్లు గర్భభరాలసయైన యయ్యంగనకుం బుంసవనాది కృత్యంబులు
నిర్వర్తించిన యనంతరంబున నవమాసావసానం బగుటయు శుభ
ముహూర్తంబునఁ గుమారుం డుదయించిన.

87


మ.

కురిసెం బువ్వులవాన చూపరుల చూడ్కుల్ వేడ్క నోలాడఁగా
నెరసెన్ మెల్లనిచల్లగాలి కొదమల్ నెత్తావి నిండారఁగాఁ
బొరసెన్ దిక్కులు నొక్కవింతచెలువంబున్ దత్కుమారప్రతా
పరుచిం బోలమి నాఁ బ్రశాంతగతి సంప్రాప్తించె వైశ్వానరున్.

88