క. 'కృతిముఖమున దైవనమ, స్కృతి యొండె నభీష్టవస్తుకీర్తన మొండెన్, వితతాశీఃపద మొండెను, బ్రతిపాదింపంగ వలయు భద్రాపేక్షన్.' అను న్యాయమున వస్తునిర్దేశరూపమంగళము. క. 'శుభసుఖరుక్క్షయధనకన, కభయైశ్వర్యములఁ జేయుఁ గవులకుఁ గావ్య, ప్రభులకుఁ గృతులకు మొదల, న్మభజసనయరతగణాళి మల్లియరేచా.’ అని భీమునిఛందమందుఁ జెప్పి యున్నది గనుక నాదియందు నగణప్రయోగము వెలయు ననునది శుభపదము నకార మమృతబీజమును.
భారతార్థము. అఖిలభువనములోనన్, వారణనగరి = హస్తిపురము, పురమతల్లి = పురశ్రేష్ఠమైనది, నాన్ = అనఁగా. ని. “మతల్లికామచర్చికాప్రకాండముద్ఘతల్లజౌ ప్రశస్తవాచకాన్యమూని” అని అ. అవారణనగరిపురమతల్లి యనుదిక్కున, క. 'పొసఁగం బల్కెడునెడఁ బొ, ల్పెసఁగిన ప్రథమాంతములపయిం గదిసి కడుం, బసనారు కచటతపలను, గసడదవల్ ద్రోచివచ్చుఁ గవిజనమిశ్రా.' అని యాంధ్రభాషాభూషణమందును, క. 'ప్రథమాంతవిభక్తులపైఁ, గథితము లగుకచటతపలు గసడదవ లగుం, బృథివి నవి గజడదబ లగుఁ, బ్రథమపుసున్నలు గణాంతపదమున మీఁద' నని యనంతునిఛందమందును జెప్పినలక్షణమువలన, పకారమునకు వకారము రావలసినందుకుఁ దాతంభట్టుగారు కవిలోకచింతామణియందు. క. 'భిన్నపదప్రథమలపై, నున్న పకారంబు నత్వ మెందును వళులన్, ము న్నిజరూపము ప్రాసము, నన్నవరూపంబు దాల్చు నాళీకాక్షా.' అని విశేషవిధులుగాఁ జెప్పిరి. శా. 'ఆవాలుంగనుదోయి యా నగుమొగం బాగుబ్బపాలిండ్లపెం, పావేణీరుచి నూతనూవిలసనం బాయొప్పులేఁ జెప్పినన్, గైవారం బగుఁగాని యయ్యెడ శిరఃకంపంబుతోఁ గూడ నా, హా పుట్టింపదె పుష్పధన్వునకు నయ్యబ్జాక్షి నీక్షించినన్.' అని పిల్లలమఱ్ఱి వీరన్నగారిప్రయోగమును. ఉ. 'భూనుతకీర్తిబ్రాహ్మణుఁడు పుట్టఁగఁ దోడనె పుట్టు నుత్తమ, జ్ఞాన' మని యివి మొదలయిన కవిత్రయమువారి ప్రయోగములును వ్రాసినందువలనఁ బ్రథమాంతముమీఁది పకారమునకు వకారాదేశము ప్రాసస్థానమందు నిత్యముగా వచ్చును. యతిస్థానమం దుండరాదు. ఇతరత్ర యేదైనఁ జెప్పవచ్చునన్నట్టాయెను గనుక, వారణనగరిపురమతల్లి యని చెప్పవచ్చును, కాఁగానే, సూరపరాజుగా రీమీఁదటిపద్యమందును విముఖతసమదాటోపారిపంక్తిరథుఁ డని, రామాయణార్థమందుఁ జెప్పినారు. ప్రకృతము, తనర్చి = ప్రకాశించినదై, అయోధ్య = యుద్ధము చేయ శక్యము గానిది, యోద్ధు మశక్యా = అయోధ్యా యనునర్థమందు, “ఋహలోర్ణ్యత్ " అని సూత్రమున ణ్యత్ప్రత్యయాంతము. నిడుపులుడుపఁ దెనుఁ గగును. నాన్ = అనంగా, రాజ = దిగ్దేశరాజులచేతనైన, వినుతి గనిన, రాజధాని = సింహాసనస్థలమైనది, వెలయును, క్రియ.