శ్రీరస్తు
శ్రీ రామచంద్రపరబ్రహ్మణే నమః
రాఘవపాండవీయము
సవ్యాఖ్యానము
ప్రథమాశ్వాసము
కథాప్రారంభము
ఆ. | వెలయు నఖిలభువనములలో నవారణ | 1 |
రామాయణార్థము. అఖిలభువనములలోన్ = సకలజగత్తులలోపల, 'విష్టపం భువనం జగత్', అని యమరము. అవారణ = అనర్గళమైన, నగరిపు = ఇంద్రునియొక్క, రమ = సంపదకు - అవారణపదము రమకు విశేషణము. తల్లి = పోషించునది, నాన్ = అనఁగా - ఉ. 'శ్రీ యన గౌరి నాఁబరఁగు చెల్వ' యని సోమయాజి ప్రయోగము. తనర్చి = ప్రకాశించినదై - రాజ్యలక్ష్మి మిగులఁ బ్రబలఁగా, ఇది యత్యుక్తి. ఇందుకు లక్షణము చంద్రాలోకమందు, "అత్యుక్తిరద్భుతాతథ్యశౌర్యాచార్యాదివర్ణనమ్, త్వయి దాతరి రాజేంద్ర యాచకాః కల్పశాఖినః" అని. 'భువనములలో నవారణ' అనుదిక్కున సంధికి ఆంధ్రభాషాభూషణమందు, క. 'మానుగ విభక్తులందుం, బూనిన నురులులకు నచ్చు వోయినఁబోవు' నను లక్షణమువలన నుకారము లోపము. రమ తల్లి యనుదిక్కున, గీ. 'క్షమ నకారాంతరూపప్రకాశికంబు, లైన పుంలింగములు దక్క నన్నిటికిని, బరఁగ సంబంధషష్ఠిపైఁ బ్రథమ యగును, దంతికన్నులు రమపల్కు తరువుకొమ్మ.' అను లక్షణమువలన షష్ఠ్యర్థమందుఁ బ్రథమాంతరూపము. అయోధ్య నాన్ = అయోధ్య యనెడిపేరు గలదై, రాజవినుతి గనిన రాజధాని, వెలయున్ = సర్వోత్కృష్టమై వర్తించును.