పుట:రాఘవపాండవీయము (పింగళి సూరన).pdf/42

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

టీక. ఆధ్యాత్మతత్త్వవిద్యా= బ్రహ్మవిద్యచేత, సాధ్యునకు = సాధింపఁదగినవానికి - తెలియఁదగినవాని కనుట ఇతరవిద్యలచే నెట్టివారిచేతను సాధింపఁదగిన వాఁడు గాఁడని భావము, సమస్త = ఎల్లరగు, యోగిజన = తపోవంతులయొక్క, హృత్కమల = మానసాబ్జములచేత, ఆరాధ్యునకు = పూజింపఁదగినవానికి, కాల = కాలముచేతను, దిక్ = దిక్కులచేతను, అనవరోధ్యునకున్ = అడ్డగింపఁబడఁదగనివానికి, అధ్యుషిత = ఉనికి చేయఁబడిన, తిగ్మరుచి = వేఁడివెలుంగుయొక్క, మధ్యునకున్ = నడుముగలవానికి - త్రిమూర్తులును మార్తండమండలమధ్యవర్తు లగుట వేదనిష్ఠము.

క.

శంకారుజాపహృత్యగ, దంకారున కచలితామృతప్రియముఖస
త్యంకారభక్తియుక్త్య క, లంకారచితార్యనుత్యలంకారునకున్.

43


టీక. శంకా = భయ మనెడు, రుజా = నొప్పియొక్క, అపహృతి= పోఁగొట్టుటయందు, అగదంకారునకున్ = వెజ్జగువానికి - ఆశ్రితులకు జననాదులవలనఁ గలుగుభయమును బాపువాఁ డని భావము, అచలిత = చలింపఁబడని - అనఁగా నెడవాయనిముఖశబ్దమునకు విశేషణము, ఆమృత = సుధవలె, ప్రియ = ఇంపయిన, ముఖవాక్కులయొక్క, (ఇట లక్షణ), సత్యంకార = నిజమైన - అనఁగా నిశ్చలమైన, భక్తి = భక్తియొక్కయు, యుక్తి = కూడికచే, అకలంక = కాలుష్యము లేకుండునట్లుగా, ఆరచిత = మించఁజేయఁబడిన, ఆర్య= పెద్దలయొక్క, నుతి = స్తోత్రములే, అలంకారునకున్ = తొడవుగాఁ గలవానికి - కేవలభక్తితోడ సుజనులు చేయు స్తోత్రమునకు సంతసించువాఁ డని భావము.

క.

ప్రార్థనపరసురసార్థహి, తార్ధకృతత్రిపురదైత్యహతికిన్ వేదాం
తార్థావనలీలాచరి, తార్థీకృతబహుమహర్షిహర్షితమతికిన్.

44

టీక. ప్రార్థన = వేఁడుకోలునందు, వర = సక్తులైన - అనఁగాఁ బ్రార్థించుచున్న, సురసార్థ = వేల్పుగుమికి, హిత = మేలైన, అర్థ = ప్రయోజనముకొఱకు, కృత = చేయఁబడిన, త్రిపురదైత్య = త్రిపురాసురులయొక్క, హతికి = చావు గలవానికి - అనఁగా దేవతలెల్లఁ బ్రార్థింపఁగా వారికొఱకుఁ ద్రిపురాసురులఁ జంపెనని భావము, వేదాంత = ఉపనిషత్తులయొక్క, అర్థ = ఆర్థముయొక్క, ఆవన = పాలనమునందుఁగల, లీలా = విలాసముచేత, చరితార్థీకృత = సార్థకములుగా నొనర్పఁబడిన, బహు = అనేకులైన, మహర్షి = గొప్పఋషులయొక్క, హర్షిత = సంతసమందిన, మతికిన్ = మనస్సు గలవానికి - అనఁగా వేదాంతార్థానుసరణంబుగఁ దా నటించి మహర్షులయెన్నికలను సఫల మొందించెనని భావము.

క.

దక్షమఖధ్వంసునకుం, జక్షూభవదనలకుముదసఖహంసునకున్
భిక్షాసరిరంసునకున్, వీక్షాసఫలితమనోజవిజిఘాంసునకున్.

45