పుట:రాఘవపాండవీయము (పింగళి సూరన).pdf/37

ఈ పుట అచ్చుదిద్దబడ్డది


ఉ.

పావనమూర్తియై విజయభైరవసద్బిరుదాంకుఁ డై దశా
శావనితాలలాటతటచందనచిత్రకభావభాగ్యశ
శ్శ్రీవిభవాభిరాముఁ డయి జృంభితదానవిహారుఁ డై ధరి
త్రీవలయంబునన్ వెలసెఁ దిమ్మనృపాలుఁడు ధర్మశీలుఁ డై.

29

టీక. పావనమూర్తియై = నిర్మలదేహుఁడై - సౌందర్యవంతుండై యనుట, విజయభైరవసద్బిరుదాంకుఁడై = విజయభైరవుఁ డను మేటిబిరుదు గలవాఁడై, దశ = పదియైన, ఆశా = దిక్కు లనెడు, వనితా = కాంతలయొక్క, లలాటతట = అలికప్రదేశములయందుఁ గల, చందనచిత్రకభావ = గంధపుబొ ట్టగుటను, భాక్ = పొందిన, యశశ్శ్రీవిభవ = కీర్తివైభవముచేత, అభిరాముఁడయి = ఒప్పినవాఁడై - అనఁగా శుభ్రకీర్తి యెల్లదిశల వ్యాపించిన దని భావము, జృంభితదానవిహారుఁడై = ప్రశస్తత్యాగపరుఁడయి, ధర్మశీలుఁడై = పుణ్యస్వభావుఁడయి, తిమనృపాలుఁడు = తిమ్మరాజు, ధరిత్రీవలయంబునన్ = భూతలమునందు, వెలసెన్ = ప్రకాశించెను.

క.

ఉభయకులసిద్ధిఁ దనరెడు, నభినవగుణములఁ బ్రసిద్ధ యగుతిమ్మాంబన్
విభవమునఁ బెండ్లి యాడెను, ద్రిభువనవిభుఁ డాకువీటితిమ్మవిభుఁ డొగిన్.

30

టీక. త్రిభువన = ముల్లోకములయందు వ్యాపించిన, విభుఁడు = ప్రతాపము గల, ఆకువీటి = ఆకువీడను పట్టణమునకు రాజైన, తిమ్మవిభుఁడు = తిమ్మరాజు, ఒగిన్ = క్రమమున - వయఃప్రాప్తియం దనుట, ఉభయకుల = పుట్టినమెట్టినయింటివారి వంగడములయొక్క, సిద్ధిన్ = నిల్కడచేత, తనరెడు = ఒప్పునట్టి, అభినవగుణములన్ = క్రొత్తలైన సద్గుణములచేతను, ప్రసిద్ధ యగు= ప్రసిద్ధురా లైన - పాతివ్రత్యాదిసద్గుణమహిమచే నుభయకులోద్ధారకురా లయిన దనుట. తిమ్మాంబన్ = తిమ్మమ్మను, విభవమునన్ = వైభవమున, పెండ్లి యాడెను = వివాహ మయ్యెను.

చ.

పటుబలశాలి తిమ్మనరపాలుఁడు పుత్త్రులఁ గాంచె విక్రమో
ద్భటుఁ బెదవేంకటాద్రిఁ బ్రతిపక్షహరుం బినవేంకటున్ మరు
ద్విటపిసమానదానఘను వేంకటరాయని భవ్యతేజు వెం
కటవరదున్ బుధప్రణుతి గాంచినతిమ్మమయందుఁ బెంపుగన్.

31

టీక. పటుబలశాలి = గట్టిబల్మిగల, తిమ్మనరపాలుఁడు = తిమ్మభూపతి, బుధప్రణుతి గాంచిన = పెద్దలస్తోత్రమును బొందిన, తిమ్మమయందు = తిమ్మాంబయందు, పెంపుగన్ = వృద్ధిగా, విక్రమోద్బటున్ = పరాక్రమోద్దండుఁ డైన, పెదవేంకటాద్రి = పెద్దవేంకటాద్రి యనునాతని, ప్రతిపక్షహరున్ = శత్రుసంహారకుఁ డయిన, పినవేంకటు = చిన్నవేంకటాద్రి యనునాతని, మరుద్విటపిసమాన = కల్పవృక్షముతో నీ డయిన, దాన =