పుట:రాఘవపాండవీయము (పింగళి సూరన).pdf/34

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తదాది యని నిర్ధారణ చేయుట కాకరము లేదు. ఇప్పటివాడుక సాదిగాఁ గనుపడుచున్నయది.

వ.

అని యిట్లు కృతోత్సాహుండ నగుచు నేతత్ప్రబంధనిబంధనారంభం
బునకుఁ బ్రేరకుం డైనసకలాంతర్యామి హేమకూటాధ్యక్షుండు శ్రీ
విరూపాక్షుండే నిర్విఘ్నపరిసమాప్తిప్రచయగమనంబులకుం దాన కలం
డతనిసంకల్పానుసారంబున నెట్లు గావలయు నట్లగుం గాక నాకు
భారం బేమి యనుతలంపున నిశ్చింతుండ నై కడంగి దీనికిఁ బ్రత్యక్ష
నియామకుం డైన పెదవేంకటాద్రిమహీవల్లభువంశక్రమం బభి
వర్ణించెద.

20

టీక. అని యిట్లు, కృత = చేయఁబడిన, ఉత్సాహుండ నగుచున్ = పూనిక గలవాఁడనై, ఏతత్ప్రబంధ = ఈకావ్యముయొక్క, నిబంధనారంభంబునకున్ = నిర్మాణప్రారంభమునకు, ప్రేరకుం డైన = పురికొల్పువాఁ డగునట్టి, సకలాంతర్యామి = సర్వజనహృదయాంతర్వర్తియైన, హేమకూటాధ్యక్షుండు = హేమకూటాచలేంద్రుఁడగు, శ్రీవిరూపాక్షస్వామియే, నిర్విఘ్న = చెఱుపు లే కుండునట్లు, పరిసమాప్తి = ముగియుటకును, ప్రచయగమనంబులకున్ = వ్యాప్తి నొందుటకును, తాన = తానే - శ్రీవిరూపాక్షుఁడే యనుట, కలండు = ఉన్నాఁడు. అతని = ఆవిరూపాక్షస్వామియొక్క, సంకల్పానుసారంబున = ఇచ్ఛవెంబడిని, ఎట్లు = ఏరీతి, కావలయున్ = కావలయునో, అట్లు = ఆరీతి, అగుంగాక = ఔఁ గాత, నాకు, భారంబు = బరువు, ఏమి యనుతలంపునన్ = ఏమి యున్న దనుభావముచే, నిశ్చింతుండ నై = వగపు లేనివాఁడ నై, కడంగి = యత్నపడి, దీనికిన్ = ఈప్రబంధనిర్మాణమునకు, ప్రత్యక్ష = ఎదుట నుండునట్టి, నియామకుండు = ప్రోత్సాహకుఁడు, ఆయిన, పెదవేంకటాద్రిమహీవల్లభు = పెదవేంకటాద్రిప్రభువుయొక్క, వంశ =కులముయొక్క, క్రమంబు = వరుసను, అభివర్ణించెద = ఉగ్గడించెదను.

శా.

శ్రీశోభాఘనుఁ డిమ్మభూవరుఁడు లక్ష్మీనాథకల్పద్రుబా
హాశాఖాఫల మైనవంశమున మూర్తామోదమున్ బోలె స
ర్వాశాపూరితకీర్తివాసనలతో నావిర్భవించెన్ ధరి
త్రీశోత్తంసితభవ్యశాసనకళాహేతుప్రతాపాఢ్యుఁ డై.

21

టీక. శ్రీశోభా = సంపద్విలాసముచేత, ఘనుఁడు = అధికుఁ డయిన, ఇమ్మభూవరుఁడు = ఇమ్మరాజు, లక్ష్మీనాథ = శ్రీమన్నారాయణుఁ డనెడు, కల్పద్రు = కల్పవృక్షముయొక్క, బాహా = భుజ మనెడు, శాఖా = కొమ్మయందుఁ గల, ఫలమయిన వంశమునన్ = పండైన కులమునందు - అనఁగా క్షత్రియకులమునం దనుట, ధరిత్రీశ = రాజులచేతఁ