పుట:రాఘవపాండవీయము (పింగళి సూరన).pdf/29

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

టీక. శోభిత = ప్రకాశింపఁజేయంబడిన - ప్రసిద్ధినొందినదనుట, ఆపస్తంబసూత్రున్ = ఆపస్తంబ మనుసూత్రము గలవాని, గౌతమగోత్రున్ = గౌతములగోత్రము గలవాని, సుచరిత్రున్ = మంచినడత గలవాని, పింగళసూరసుకవిపౌత్త్రున్ = పింగళసూరన్నకవియొక్క మనమఁడైనవాని, నన్నపరతిభావన = నన్నపరతిభావనలకు, దౌహిత్రున్ = కూఁతురుకొడు కైనవాని, అమరధీమణికిన్ = అమరయకవికిని, అబ్బమకున్ = అబ్బమ్మకును, పుత్త్రున్ = తనయుఁ డయినవాని, అనుజన్ము లైనట్టి = తమ్ము లైన, అమలనయెఱ్ఱనార్యులు = అమలనయెఱ్ఱనకవులు, భక్తిన్ = భక్తిచేత, సేవింపన్ = సేవచేయుచుండఁగా, అలరువానిన్ = ఒప్పెడువాని - మహిమఁ జెందువాని ననుట, సత్కావ్య = మంచికావ్యములయొక్క - అనఁగా దోషరహితములై రసాద ప్రయుక్తము లయినవి యనుట, రచనా = కూర్పునందు, విశారదుం డగువానిన్ = నేర్పరియైనవాని, సూరననామ = సూరన యనుపేర, విశ్రుతునిన్ = ప్రసిద్ధి కెక్కినవాని, నన్నున్ = నను - క్రిందటి వెల్ల దీనికి విశేషణములు, ప్రియము = ప్రీతి, సంధిలంగన్ = తనరఁగా, పిలిపించి = పిలువ నంపి, బహు = అధికము లయిన, వస్త్ర = చేలములు, భూషణ = సొమ్ములు, ఆది = మొదలుగాఁగలవానియొక్క, దానములను = ఈవులచేత, కరంబున్ = మిక్కిలి, సంతసం బొనర్చి = సంతోషపెట్టి, ఎంతయున్ = చాల, గారవ మెసఁగన్ = ఘనత మీఱఁగా, మధురఫణితిన్ = ఇంపగుతెఱఁగున, ఇట్టులు = ఈమీఁదఁ జెప్పఁబోయెడిప్రకారమున, అనియెన్ = పల్కెను.

శా.

రెండర్థంబులపద్య మొక్కటియు నిర్మింపంగ శక్యంబు గా
కుండుం దద్గతిఁ గావ్య మెల్ల నగునే నోహో! యనం జేయదే
పాండిత్యంబున నందునుం దెనుఁగుకబ్బం బద్భుతం బండ్రు ద
క్షుం డెవ్వాఁ డిల రామభారతకథల్ జోడింప భాషాకృతిన్.

10

టీక. రెండర్థంబులపద్యము = ద్వ్యర్థి యగుపద్యమును, ఒక్కటియున్ = ఒండేనియు, నిర్మింపంగన్ = కూర్చుటకు, శక్యంబు గాకుండున్ = తరము గాకుండును, అట్లుండఁగా, తద్గతిన్ = ఆరెండర్థములు గలపద్యము చొప్పున, కావ్య మెల్ల నగునేని = ఒకప్రబంధము కడముట్ట నిర్మిత మాయెనేని - ఆకావ్య మనుట సిద్ధార్థము. అదియ కర్త, ఓహో యనం జేయదే = ఆశ్చర్యపడి మెచ్చుకొనునట్లు చేయఁజాలదా, పాండిత్యంబున నందునున్ = రెండర్థముల కావ్యమును జేయునట్టియానేర్పునందును, తెనుఁగుకబ్బంబు = ఆంధ్రకావ్యము - అనఁగా నాంధ్రకావ్యముచేత యనుట, అద్భుతం బండ్రు = అరు దందురు - పెద్ద లని కర్త, భాషాకృతి = వాగ్రూపమునఁ - గావ్యస్వరూపముగ ననుట, రామభారతకథల్ = రామాయణ భారతములను, జోడింపన్ = జంటగాఁ జేయుటకు - అనఁగా నారెండర్థములను నొకటిగాఁ జెప్పుటకు, ఇలన్ = భూమియందు, దక్షుండు =