పుట:రాఘవపాండవీయము (పింగళి సూరన).pdf/172

ఈ పుట అచ్చుదిద్దబడ్డది


శా.

అక్షుద్రప్రథమానదివ్యశరసంప్రాప్తిం బ్రకాశించునా
కుక్షిద్వంశవతంసుఁ గన్గొని మహాగోదావరీతీరస
ద్రక్షోపాయపథంబు నేఁడు దొరకె న్రండంచు సంరక్షణా
పేక్షం దద్వనభూమిదేవతలు సంప్రీతిం గడు న్మూఁక లై.

66

భారత. కుక్షిద్వంశ = భూపవంశమునకు, "గోత్రా కుః పృథివీ పృథ్వీ" అని అ. వతంసున్ = అర్జునుని, మహాగః = అధికాపరాధములచేత, “ఆగోపరాధో మంతుశ్చ" అని అ. దావరీతి = దవాగ్నిభంగిని, “దవదావౌ వనారణ్యవహ్నౌ" అని అ. రీతిశబ్ద మీకారాంత మైనందుకు, క్తిచ్ త్కౌచసంజ్ఞాయమ్మనిక్తిన్ - రాక క్తిచ్-వచ్చినది గనుక, “సర్వతో౽క్తిన్నర్థాదిత్యేకే” అని జీష్ వచ్చి యీకారాంతమైనది. రసత్ = మ్రోయుచున్న, రక్షః = రాక్షసులయొక్క, అపాయపథంబు = వధోపాయపథము, తద్వనభూమి యందు, దేవతలు= ఇంద్రాదులు, పొడచూపి. రామ. కుక్షిద్వంశవతంసున్ = రాముని, మహాగోదావరీతీరమందున్న, సత్ = సజ్జనులయొక్క, రక్షా = సంరక్షణముయొక్క, ఉపాయమార్గము, తద్వనమందున్న, భూమిదేవతలు = బ్రాహ్మణులు, పొడచూపి యుపచార మొనర్చి రని ముందరి కన్వయము.

వ.

యథోచితప్రకారంబునం బొడసూపి యతని ప్రణామాదివినయ
కృత్యంబులు గైకొని.

67


క.

అరుదుగ నుపచార మొన
ర్చిరి దీవన లెలమి నిచ్చిరి తమతమమహా
శరసాదరార్పణంబులఁ
గర మమరుచు నుండ వేడుకను సప్రభులై.

68

రామ. తమతమ, మహాశ = అధికకాంక్ష, రస = అనురాగముయొక్కయు, ఆదరముయొక్కయు, అర్పణంబులన్ = ప్రకటనములచేత ననుట, అమరుచు నుండఁగా, సప్రభులై = ప్రభాసహితులై దీవన లిచ్చిరి.

భారత. తమతమ, మహాశర = దివ్యాస్త్రములయొక్క , సాదరార్పణంబులవల్ల, సప్రభులై = ఇంద్రసహితులై దీవన లిచ్చిరి.

తే.

అంత నాత్మపురస్థితిఁ గొంతకాల
ముండి తమకార్యములకొద లుడిపి చనుట
గోరి వారలు దనుఁ దోడుకొంచుఁ జనఁగఁ
జనియె వేడ్కఁ దదావాసజగతి కతఁడు.

69

భారత. ఆత్మపురస్థితిన్ = స్వర్గస్థితిచే.