పుట:రసార్ణవాలఙ్కారము (ప్రకాశవర్షుఁడు).pdf/9

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

భోజుఁడే ప్రకాశవర్షునికృతినుండి శ్లోకార్ధమును గ్రహించె నేమో యని శర్మగా రనవచ్చును. కాని యది సరి కా దని యీక్రిందిప్రమాణమును బట్టి తెలియనగును. ఈశ్లోకమును దానికి సంబంధించిన యైతిహ్యమును 'శార్ఙ్గధరపద్ధతి'యందు లభించుచున్నవి.[1]

ఒకనాఁడు వేఁటనుండి మరలుచు భోజుఁడు తనపల్లకిని మోయు వాహకులలోఁ గ్రొత్తవానిం గని- యాతఁడు మాఱువేషమున నున్న పండితుఁ డని యెఱుఁగక— 'ఎక్కుడు బరువుచే నీభుజము బాధనొందుచున్నదా?' యని పృచ్ఛించె నఁట. దానికి బహుశాస్త్రవిశారదుఁడును, విశేషించి, శబ్దశాస్త్రనిష్ణాతయు నగుభోజుఁడు 'బాధతే' యనుటకు 'బాధతి' యని యపప్రయోగము చేసినందులకుఁ జింతించి రా జని యైనను జంకక యాపండితవాహకుఁడు వెంటనే “నీవు చేసిన 'బాధతి' యను నపప్రయోగము కలిగించినంతబాధ నాభుజము కలిగించుటలేదు" అనె నఁట! రసికుఁ డగుభోజుఁ డందుల కమితానందము నంది యాతని సన్మానించియుండును.

తనకాలమున కప్పుడే ప్రచురప్రచారము నందిన ధ్వనిసిద్ధాంతమును భోజుఁ డెఱుఁగును. ధ్వన్యాలోకమునుండి కొన్నికారికల నీతఁడు గ్రహించియు నీతఁడు ధ్వనిమతము నలక్ష్యము చేసి 'ధ్వనిమత్తాతు గాంభీర్యమ్' [I పరి. 78 శ్లో. 74 పు.] అని ధ్వనిని శబ్దగుణ మగు గాంభీర్యముగాఁ బేర్కొనెను. ప్రకాశవర్షుఁడుకూడ [2 పరి. 20 శ్లో. 6 పు.] ధ్వనిని గాంభీర్య మనుశబ్దగుణముగా నుడివియుండెను. దీనినిబట్టి ధ్వన్యాలోకకారునికంటె[క్రీ. శ. 840-860.] నీతఁడు నవీనుఁ డని తెలియుచున్నది.

'సరస్వతీకంఠాభరణము' మొదలగుకొన్నిసాహిత్యగ్రంథములలో నౌచిత్యము పేర్కొనఁబడినను 'ఔచిత్యవిచారచర్చ'లో నౌచిత్యసిద్ధాంతమును శాస్త్రదృష్టిని విచారించి, కావ్యమున కాత్మ యౌచిత్య మని నిర్ధారణచేసిన మహనీయుఁడు క్షేమేంద్రుఁడు. ఈసిద్ధాంతమును

  1. 'భూరిభారభరాక్రాన్త బాధతి స్కన్ధ ఏష తే
    న తథా బాధతే స్కన్ధో యథా బాధతి బాధతే.

    పూర్వార్ధం మృగయాయా గృహమాగచ్ఛతః శిబికారూఢస్య భోజరాజస్యోక్తిః ఉత్తరార్ధం చ రాజదర్శనార్థం ఛద్మశిబికావాహపండితస్య ప్రత్యుక్తిః'

    [శా. ప. 562 శ్లో.]