పుట:రసార్ణవాలఙ్కారము (ప్రకాశవర్షుఁడు).pdf/39

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అర్థగుణములు, దోషములు కొన్నియెడల గుణత్వము నొందుట మొదలగు ననేకవిషయములలోఁ గూడ భోజునికృతికి ప్రకాశవర్షునికృతికి ననేకసామ్యములు కానఁబడుచున్నవి. ఇంచుమించుగా నీహరణము రసార్ణవమున నామూలచూడము చూపట్టుచునేయుండును.

10. పిన్నుడి

శార్ఙ్గధరుని 'పద్ధతి' లో ప్రకాశవర్షునిశ్లోకములు రెం డుదాహరింపఁబడి యున్నవి [383; 783 శ్లో]. ఈశ్లోకములు వల్లభదేవుని 'సుభాషితావళి' లోఁగూడ [484; 834]. ప్రకాశవర్షున కారోపింపఁబడియున్నవి. ఇవికాక మఱి 27 శ్లోకములు ప్రకాశవర్షకృతములుగా 'సుభాషితావళి'లో లభించుచున్నవి. బాగుగా విమర్శింవఁగా నీసుభాషితగ్రంథములలోఁ బేర్కొనఁబడిన ప్రకాశవర్షుఁడు ప్రాచీనవ్యాఖ్యాతయగు ప్రకాశవర్షుఁడు కాఁడనియు, 'రసార్ణవ'కర్తయగు మనప్రకాశవర్షుఁడే యనియు ధృఢప్రత్యయము కలుగుచున్నది. ఏమన నాలంకారికులైనవారు కవులుగాఁ గూడఁ గన్నట్టుచున్నారుగాని, సామాన్యముగా వ్యాఖ్యాతలైనవారు కవినామప్రసిద్ధి నొందుటలేదు. ఉత్తమసాహిత్యకృతికర్తలగు దండి, ఉద్భటుఁడు, రాజశేఖరుఁడు, భోజుఁడు, క్షేమేంద్రుఁడు, విశ్వనాథకవిరాజు, విద్యానాథుఁడు, ధర్మసూరి, జగన్నాథపండితరాయలు మొదలగుమహనీయు లందరును గవిచంద్రులుగాఁ గూడఁ బ్రఖ్యాతులు. మల్లినాథాదు లేవో కొన్నిముక్తకశ్లోకము లల్లినను వీరికి వ్యాఖ్యాతలనియే కాని కవులని ప్రసిద్ధి కలుగలేదు. కావునఁ బైసుభాషితకోశములలోఁ బేర్కొనఁబడినకవి 'రసార్ణవ'కర్తయే యని నిశ్చయింపవచ్చును. మఱియు క్రీ. శ. 1200 కంటె నవీనము కాదని నిశ్చయింపఁబడిన 'కవీంద్రవచనసముచ్చయము’న ప్రకాశవర్షునిశ్లోకము లేమియుఁ గానరావు. ఇందువలనఁ గూడ సుభాషితావళిలో నుల్లేఖింపఁబడినకవి మనకవి యనియే నిర్ణయింపనగును. ఈసిద్ధాంతము సరియగుచో ప్రకాశవర్షునికాలమున కుత్తరావధి మనకు లభించుచున్నది. ధర్మదాససూరి ‘విదగ్ధముఖమండనము'ను బేర్కొనుటచే 'రసా