భోజునికృతి యెంతవఱకు ప్రకాశవర్షునకు మూలమో తెలియఁగలదు. దండి, తదనుయాయుల ప్రభావమును, అగ్నిపురాణమునందలి యలంకారప్రకరణములందలి మతప్రభావమును భోజుని యభిప్రాయములపైఁ జాలవఱకు గన్పట్టినను, నీతనికృతియందుఁ బేర్కొనఁబడిన 'గుణముల' నామములును గుణనిర్ణయపద్ధతియు విలక్షణములై, తత్పూర్వకృతులలోనివాని కనేకవిషయములు భిన్నములై చూపట్టుచున్నవి. ఇక్కడకు ప్రకాశవర్షుఁడు భోజుని విశేషముగా ననుకరించెను.
1. శ్లేష. 2. ప్రసాదము. 3. మాధుర్యము. 4. సమత. 5. సౌకుమార్యము. 6. అర్థవ్యక్తి. 7. ఓజస్సు. 8. కాంతి. 9 ఉదారత. 10. సమాధి - అని వామనునిచేఁ బేర్కొనఁబడిన శబ్దార్థగుణములు పదింటికి భోజుఁడు- 11. ఔర్జిత్యము. 12. ఉదాత్తత. 13. ప్రేయస్సు. 14. సుశబ్దత. 15. సౌక్ష్యము. 16. గాంభీర్యము. 17. సంక్షేపము. 18. విస్తరము. 19. సమ్మితత్వము. 20. భావికత్వము. 21. రీతి. 22. ఉక్తి. 23. గతి. 24. ప్రౌఢి -
అను 14 గుణములఁ జేర్చి మొత్తము గుణములు 24 అనెను. ఈతనివలె నింతవిలక్షణముగ నిన్నిగుణములను మఱి యేయాలంకారికుఁడును జెప్పియుండలేదు.
ప్రకాశవర్షుఁడుమాత్ర మిందలి గతి- ప్రౌఢి అనువానిని వదలి తక్షిన 22 గుణముల నామముల లక్షణములను భోజునికృతినుండి సంగ్రహించెను.
భోజుఁడు
IV శబ్దగుణములు: 24.
1. శ్లేష: ('సుశ్లిష్టపదతా')
2. ప్రసాదము: (‘ప్రసిద్దార్థపదత్వమ్.')
3. సమత: ('యన్మృదుప్రస్ఫుటోన్మిశ్రవర్ణబన్ధ విధింప్రతి,
అవిషమ్యేణభణనమ్.')
ప్రకాశవర్షుఁడు
శబ్దగుణములు: 22.
1. 'యత్ర బన్ధో౾తి సంక్లిష్టః.'
2. 'ప్రసిద్ధార్థపదన్యాసః'
3. 'బద్ధోమృదుస్ఫుటోన్మిశ్రవర్ణజన్మా,
న సఙ్కరః.'